● ఏజెన్సీలోని పేదలకు కేంద్ర
ప్రభుత్వ పథకంతో ప్రయోజనం
● ఆన్‌లైన్ దరఖాస్తులతో నేరుగా ఖాతాల్లోకి నగదు జమ
గోవిందరావుపేట: ఏజెన్సీలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 13ఏప్రిల్ 2017లో ఎన్‌ఎఫ్‌బీఎస్(నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్) పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో కుటుంబ పెద్ద ఆకస్మాతుగా మరణిస్తే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కాకుండా ఉండేలా రూ. 20వేలు అందిస్తుంది. ఈ పథకంపై జిల్లా యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ), సెర్ప్ అదికారులు, మండల అభివృద్ధి కార్యాలయాలతో పాటు అర్హుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. మల్లంపల్లి, ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, ఎస్‌ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, నూగూరు, వెంకటాపురం(కె) మండలాల్లో గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, గిరిజన తండాల్లో నివసించే కుటుంబాలకు పథకం వివరాలు చేరవేసేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, ఆశ కార్యకర్తల సహకారంతో ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు.
18 నుంచి 59 ఏళ్ల వరకు అర్హులు
తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి.. 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి కుటుంబానికి పెద్ద అయిన వ్యక్తి సహజ మరణం పొందితే లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే పథకం వర్తిస్తుంది. మరణించిన వ్యక్తికి భార్య ఉండడంతో పాటు చిన్న పిల్లలు ఉంటే మాత్రమే పథకం వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ బీమా యోజన (ఏఏబీవై), జనశ్రీ బీమా యోజన (జేబీవై) పథకాల కింద ఇప్పటికే లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అర్హులు కారని అధికారులు చెబుతున్నారు.
ఎంపీడీఓ నుంచి జిల్లాస్థాయి వరకు పరిశీలన
మీ సేవ కేంద్రం లేదా ఆన్‌లైన్ ద్వారా ఎన్‌ఎఫ్‌బీఎస్ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు సమర్పించిన పత్రాలను పరిశీలించి పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్లు, బిల్ కలెక్టర్ సహకారంతో ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. తర్వాత దరఖాస్తులను సంబంధిత జిల్లా డీఆర్‌డీఓకు ఫార్వర్డ్ చేస్తారు. కలెక్టర్ ఆమోదం అనంతరం డీఆర్‌డీఓ ప్రతీ కేసుకు ఫండ్‌ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ (ఎఫ్‌టిఆర్) రూపొందించి సెర్ప్ సీఈఓకు ఆన్‌లైన్ ద్వారా పంపిస్తారు. అనంతరం సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ డైరెక్టర్ ఆమోదంతో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ అయ్యేలా ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు జారీ చేస్తారు. దరఖాస్తుదారులు ఫొటోతో కూడిన దరఖాస్తు ఫారం, వైట్ రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు, మరణ ధృవీకరణ పత్రం, మరణించిన వ్యక్తి ఆదార్ కార్డ్, పాస్ ఫొటో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ కాపీ వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
అర్హులు పథకానికి దూరం కావొద్దు
పేదలకు ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంది. 13 ఏప్రిల్ 2017 తర్వాత మరణించిన అర్హుల కుటుంబాలు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. జిల్లాలోని అన్ని మండలాల్లో అర్హుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. గిరిజన, మారుమూల గ్రామాల్లోని బాధితులకు పథకం ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన పత్రాలతో సమీప మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలన అనంతరం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుంది.
– చంద్రశేఖర్, డీఆర్‌డీఓ


