ములుగు: రేపు(సోమవారం)జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించనున్న మాక్ ఎక్సర్‌సైజ్ ఏర్పాట్లను శనివారం ఆర్డీఓ వెంకటేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వివేకానంద, కృష్ణ, పల్సాబ్‌పల్లి ప్రాంతాల్లో చేపట్టనున్న వాస్తవిక వరద మాక్‌డ్రిల్‌కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను శనివారం ఆయన సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. మాక్‌డ్రిల్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగరాజు, సీపీఓ ప్రకాశ్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అప్పలనాయుడు, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, మత్స్యశాఖ అధికా రి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బతో
ఐదుగురికి అస్వస్థత
వాజేడు: మండల పరిధిలోని పెనుగోలు కాలనీకి చెందిన ఐదుగురు వడదెబ్బతో శనివారం అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వంట చెరుకు కోసం సమీప అడవిలోకి ఉయిక రాంబాయి, ఉయిక శాంతమ్మ, ఉయిక అంజలి, ఉయిక సావిత్రి, సోడి లక్ష్మిలు వెళ్లారు. ఈ క్రమంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా సిబ్బంది వైద్యం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీఓ శ్రీకాంత్‌నాయుడు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు.
ఎస్సీ సెల్ కమిటీల
ఏర్పాటుకు కసరత్తు
ములుగు: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎస్సీ సెల్ నూతన కమిటీల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ ఇన్‌చార్జ్ చిరంజీవి తెలిపారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా జిల్లాలో ఎస్సీ సెల్ నూతన కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిషలు సేవలందిస్తున్న నాయకులు, పదవులు ఆశించే ఆశవహులు ఎవరైనా పదవులకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అదిష్టానం దృష్టికి తీసుకెళ్లి పదవులు ప్రకటిస్తామని వివరించారు. ఈ మేరకు పలువురు దరఖాస్తులు అందజేయగా స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
శని జయంతికి భక్తుల రద్దీ
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరాలయం అనుబంధ దేవాలయం నవగ్రహాల వద్ద శనివారం అమావాస్య సందర్భంగా శని జయంతిని పురష్కరించుకొని భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అధిక సంఖ్యలో శని పూజలు నిర్వహించారు.
నార్కొటిక్ జాగిలాలతో తనిఖీలు
భూపాలపల్లి అర్బన్: గంజాయి సరఫరా, వినియోగాన్ని అరికట్టడంపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు శనివారం ఆపరేషన్ ఆర్‌ఐ కాశీరాం ఆధ్వర్యంలో ఈగల్ టీం సిబ్బంది నార్కొటిక్ డాగ్ సహాయంతో పాన్‌షాప్‌లు, కిరాణా దుకాణాలు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాలను ఎవరైనా నిల్వ ఉంచినా, విక్రయిస్తున్నట్లు తెలిసినా డయల్ 100 లేదా సమీప పీఎస్‌కు తెలియజేయాలని కోరారు.


