● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
ములుగు రూరల్/గోవిందరావుపేట: పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం మండల పరిధిలోని మల్లంపల్లితో పాటు గోవిందరావుపేట మండల పరిధిలోని పస్రాలోని సోమలగడ్డ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా నుంచి ఎట్టి పరిస్థితుల్లో పశువుల అక్రమ రవాణా జరగకూడదని, ఎవరైనా నిబంధనలకు ఉల్లంఘించి పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వహించాలన్నారు. విధుల్లో అలసత్వం వహించొద్దని హెచ్చరించారు. పశువులు రవాణా చేసే వ్యక్తుల వద్ద సరైన పత్రాలు ఉన్నాయా లేదా పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. తనిఖీ వివరాలు ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. అనంతరం మల్లంపల్లి, పస్రాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం రవాణాకు లారీల కొరత ఉందని రైతులు విన్నవించగా వెంటనే స్పందించిన ఎస్పీ లారీ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి తగినన్ని వాహనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతుల ధాన్యం తరలించే వరకు పోలీసులు అండగా ఉంటారని హామీనిచ్చారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శంకర్, ములుగు, పస్రా సీఐలు సురేశ్, దయాకర్, ములుగు, పస్రా ఎస్‌హెచ్‌ఓలు ఉపేందర్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


