● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు
మంగపేట: మండల పరిధిలోని కత్తిగూడెంలో నిరుపయోగంగా మారిన శివగంగ ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తీసుకురావాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కత్తిగూడెం సమీపంలోని గోదావరి ఒడ్డున నిర్మించిన ఇంటెక్‌వెల్, బ్రాహ్మణపల్లి వద్ద ఎత్తిపోతల పథకం సంప్‌ను ఆయన పార్టీ నాయకులు, రైతులతో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.కోట్లు ఖర్చు పెట్టి ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ విషయంపై మంత్రి సీతక్క స్పందించి ఎత్తిపోతల పథకం రైతులకు ఉపయోగపడేలా గోదావరిలో అడ్డుగా ఉన్న ఇసుక మేటలను తొలిగించి 1500 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తాటి కృష్ణ, తుమ్మ మల్లారెడ్డి, ఎడ్లపెల్లి నర్సింహారావు, నాగరమేశ్, వలీబాబా, అశోక్, ప్రదీప్‌రావు పాల్గొన్నారు.


