నత్తనడకన.. | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన..

May 14 2026 6:39 AM | Updated on May 14 2026 6:39 AM

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు

సామగ్రి ధరలు తగ్గించాలి

ఏటూరునాగారం: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెరి గిన ఇంటి సామగ్రి ధరలతో పాటు కార్మికులకు డిమాండ్‌ భారీగా పెరిగింది. దీంతో ఇళ్ల నిర్మాణానికి ఖర్చు పెరగడంతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు జిల్లాలో 5,051 ఇళ్లు మంజూరు కాగా 966 ఇళ్ల నిర్మాణ పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. జిల్లాలోని పది మండలాల పరిధిలో 174 గ్రామ పంచాయతీలున్నాయి. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసినప్పటికీ ఆర్థిక కష్టాలతో ఇళ్లను నిర్మించుకోలేని వారు 174 మంది ఉన్నారు. వీరికి మొదటి దశలో ఇళ్లు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో రద్దు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

పెరిగిన ధరలు

లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ఇసుక, సిమెంట్‌, స్టీల్‌, సెంట్రింగ్‌, కంకర, బైండింగ్‌ వైర్‌, బోర్‌ వెల్‌ లాంటి సామగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి లబ్ధిదారుల ఎంపిక జరగడంతో ఈ సామగ్రికి డిమాండ్‌ పెరిగింది. దీంతో లబ్ధిదారులు కష్టాలు పడుతూ ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. 2025కు ముందు సిమెంట్‌ ఒక బస్తాకు రూ. 265లు ఉండగా ప్రస్తుతం రూ. 320కి చేరుకుంది. 2025 డిసెంబర్‌లో స్టీల్‌ ధర క్వింటాకు 10 ఎంఎం బార్లు 20కి రూ.2,300లు ఉండగా ప్రస్తుతం రూ.3,800లకు చేరుకుంది. ఇలా అనేక ముడి సరుకు ధరలు పెరగడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై మరింత భారం పెరిగింది.

భవన నిర్మాణ కార్మికులకు..

ఇటు ఇంటి సామగ్రితో పాటు భవన నిర్మాణ కార్మికుల కూలీరేట్లు సైతం పెరిగాయి. గతంలో 400 గజాల స్లాబ్‌ను మేసీ్త్రలు రూ.1.65లక్షలకు నిర్మించి ఇచ్చేవారు. అదే ఏరియాలో ఇప్పుడు రూ. 2.65 లక్షలకు నిర్మించాల్సి వస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇలా అనేక సామగ్రితో పాటు కూలీల ధరలకు రెక్కలు వచ్చాయని చెబుతున్నారు. గతంలో మేసీ్త్రకి కూలి రూ.800 ఉంటే ఇప్పుడు రూ.1,000 తీసుకుంటున్నారు. పార కూలీకి రూ. 500లు ఉండగా ఇప్పుడు రూ. 600లు తీసుకోవడం గమనార్హం. 10 వేల ఇటుకల లారీ లోడ్‌కు గతంలో రూ.71 వేలు ఉండగా ప్రస్తుతం రూ.92వేలకు చేరుకుంది. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఇంటి సామగ్రి ధరలు తగ్గించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

మొత్తం మంజూరైన ఇళ్లు 5,051

నిర్మాణం పూర్తయినవి 966

పనులు ప్రారంభించని ఇళ్లు 174

గోడల వరకు 396

బేస్‌మెంట్‌ లెవల్‌ 1,136

రూఫ్‌ లెవల్‌ 901

స్లాబ్‌ లెవల్‌ 1,478

సిమెంట్‌తో పాటు ఇతర వస్తువుల ధరలు తగ్గించాలి. ధరలు పెరగడం వల్ల ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ఇళ్ల ప్రారంభానికి ముహూర్తాలు చేసుకొని ఆర్థిక పరిస్థితి లేక పనులు మొదలు పెట్టడం లేదు. ముడి సరుకులకు ధరలు పెంచడం వల్ల సామాన్యులపై ఆర్థిక భారం పడుతుంది.

– గాడిచర్ల సాంబయ్య, ఏటూరునాగారం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో జాప్యం

పెరిగిన ఇంటి సామగ్రి ధరలు

కార్మికులకు ఫుల్‌ డిమాండ్‌

లబ్ధిదారులను వెంటాడుతున్న

ఆర్థిక కష్టాలు

5,051 ఇళ్లు మంజూరు..

పూర్తయినవి 966

Advertisement
 
Advertisement
Advertisement