నిఘా పెట్టాం..
గోవిందరావుపేట: మండలంలో అక్రమ పశువుల రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రింబవళ్లు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మండలంలోని ప్రధాన రహదారులు, అడవి మార్గాలు, గ్రామీణ లింక్ రోడ్లపై ప్రత్యేక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బక్రీద్ నేపథ్యంలో భారీగా పశువుల కొనుగోలు, అమ్మకాలు జరిగే అవకాశముందని ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
అడవి మార్గాలపై నిఘా..
అక్రమ రవాణాదారులు పోలీసులను తప్పించుకునేందుకు అడవి మార్గాలు, గ్రామీణ రహదారులను వినియోగించే అవకాశముందని భావించిన పోలీసులు అక్కడ కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మొబైల్ పెట్రోలింగ్ పెంచి అనుమానాస్పద కదలికలపై కన్ను వేస్తున్నారు. స్థానిక సమాచారం ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మీక తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణాదారుల కదలికలను అడ్డుకుంటున్నారు. దీంతో మండలంలో ఎక్కడ చూసినా పోలీస్ వాహనాల సైరెన్లు, తనిఖీలు కనిపిస్తుండటంతో అక్రమ దందాదారులు భయాందోళనకు గురవుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.
కఠిన చర్యలు
అక్రమ పశువుల రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనుకాడటం లేదని సమాచారం. అనుమతి పత్రాలు లేకుండా తరలింపులు చేస్తే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పస్రా పోలీసుల అప్రమత్తతపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఎస్సై తాజుద్దీన్ స్వయంగా రంగంలోకి దిగి తనిఖీలు పర్యవేక్షించడం పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతుల ఆస్తులను కాపాడటంతో పాటు అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు చూపుతున్న కట్టుదిట్టమైన వైఖరి ప్రస్తుతం మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పశువుల అక్రమ రవాణా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా అనుమానాస్పదంగా పశువుల తరలింపు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బక్రీద్ పేరుతో అక్రమ దందాలు చేస్తే సహించేది లేదు.
– తాజుద్దీన్, ఎస్సై, పస్రా
అడుగడుగునా పోలీసుల తనిఖీలు
దళారుల ఎత్తుగడలకు చెక్


