మున్సిపాలిటీలో సమస్యల తిష్ట
అంతర్గత రహదారులు అధ్వానం
కొలువుదీరిన నూతన పాలకవర్గానికి సవాల్
ములుగు: మున్సిపాలిటీగా ఏర్పడిన ములుగు పట్టణంలో సమస్యలు తిష్ట వేశాయి. ప్రత్యేక అధికారుల పాలనలో పట్టణంలో సమస్యలన్నీ పేరుకుపోయాయి. అభివృద్ధికి నోచుకోక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ములుగు పట్టణం నూతన పాలకవర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పట్టణంలో ప్రధానంగా డ్రెయినేజీ, రోడ్లు, తాగునీటి సమస్య నెలకొంది. అన్ని కాలనీల్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉండడంతో పాటు మురుగునీరు రోడ్లపైకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది. అంతర్గత రహదారులు, తాగునీటి సమస్య, వీధి దీపాల నిర్వహణ సరిగా లేక పట్టణం పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.
కొత్త పాలకవర్గంపైనే ఆశలు
కొత్త పాలకవర్గంపై పట్టణంలోని 20 వార్డులకు చెందిన 13,963 మంది ఓటర్లు కోటి ఆశలు పెట్టుకున్నారు. స్థానిక సమస్యల పరిష్కారమే ఎజెండాగా ప్రకటించి ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
రామప్ప చెరువులోకి మురుగునీరు
పట్టణానికి చెందిన మురుగునీరంతా రామప్ప సరస్సులోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే కాలనీలు జలమయమవుతున్నాయి. వర్షపునీటితో మురుగునీరంతా రామప్ప చెరువులోకి వెళ్తుండడంతో రామప్ప సరస్సు నీరు కలుషితమవుతోంది. జిల్లాలోని 4 మండలాల పరిధిలో గల 175 శివారు గ్రామాల ప్రజలకు ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందిస్తున్న సరస్సులోకి మురుగునీరు వెళ్తున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉంది.
పట్టణమంతా పైపులైన్ లీకేజీలే..
పట్టణంలోని అనేక కాలనీల్లో పైపులైన్ లీకేజీలు ఏర్పడి తాగునీరంతా వృథాగా పోతోంది. మున్సి పల్ ఎన్నికల ముందు తాగునీటిని సరఫరా చేసే బోర్లు సైతం మరమ్మతులకు రావడంతో వారం రోజుల పాటు కొన్ని కాలనీల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీటికి ప్రాధాన్యం కల్పించి పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు చేపట్టి తాగునీటి సమస్య ను రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
తీవ్రంగా కోతులు, కుక్కల బెడద
ములుగు పట్టణ కేంద్రంలో కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ప్రజలు గడపదాటి రావాలంటే వానరాలను చూసి భయంతో వణికిపోతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులపై సైతం కోతులు దాడులు చేస్తున్నాయి. కోతుల బెడదతో పాటు కుక్కల బెడద ఉండడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పట్టణంలో అంతర్గత రహదారులు ఆధ్వానంగా మారాయి. ఎక్కడ చూసినా గుంతలతో దర్శనమిస్తున్నాయి. కల్వర్టులు సైతం ధ్వంసం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో ఉన్న రహదారులు ఇరుకుగా ఉండడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. కొన్ని రహదారులు 15 ఫీట్లు ఉండడంతో రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లలేని పరిస్థితితో వాహనదారుల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంటుంది. రోడ్లను విస్తరించేందుకు ఇరువైపులా ఉన్న ఇంటి యజమానులు మరో 5 ఫీట్ల దారి ఇవ్వాలని అడిగితే ససేమిరా ఇవ్వమని అంటుండడంతో రోడ్ల విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు.
పట్టణాన్ని పీడిస్తున్న డ్రెయినేజీ సమస్య
రామప్ప చెరువులోకి మురుగునీరు
అధ్వానంగా అంతర్గత రహదారులు
పైపులైన్ల లీకేజీలు.. తాగునీటి సమస్య
కోతులు, కుక్కల బెడద
మున్సిపాలిటీలో సమస్యల తిష్ట
మున్సిపాలిటీలో సమస్యల తిష్ట
మున్సిపాలిటీలో సమస్యల తిష్ట
మున్సిపాలిటీలో సమస్యల తిష్ట


