రామప్ప టెంపుల్ అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ అద్భుతంగా ఉందని అమెరికాకు చెందిన డేవిడ్ అబాట్ కొనియాడారు. రామప్ప ఆలయాన్ని ఆయన బుధవారం సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని అబాట్ కొనియాడారు.
రేపటి వరకు
సీసీఐ కొనుగోళ్లు
ములుగు రూరల్: ములుగు వ్యవసాయ మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోళ్లు రేపటి(శుక్రవారం) వరకు కొనుగోళ్లు చేపట్టనున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి సోనియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా రైతులు పత్తి అమ్మకాలు సీసీఐకి చేపట్టాలని వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రైతులు పత్తి విక్రయాలను గడవు లోపు చేపట్టి అధికారులకు సహకరించాలని కోరారు.
ములుగు: ప్రధానమంత్రి ముద్రయోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సిద్ధార్థ్ రెడ్డి పేర్కొన్నారు. ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈడీసీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ముద్ర యోజన పథకంపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించడానికి ఈ పథకం ద్వారా ఎలాంటి గ్యారంటీ పత్రాలు లేకుండానే కనిష్టంగా రూ.50 వేల నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జిల్లా పరిశ్రమ కేంద్రంలో సంప్రదించాలని పేర్కొన్నారు. నిరుద్యోగులు, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునేవారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశ్వర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ జయప్రకాశ్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వెంకన్న, ఈడీసీ మేనేజర్ విక్రమ్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్ రాఘవేందర్, రాధిక పాల్గొన్నారు.
భూపాలపల్లిరూరల్: ఆజంనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు సక్రమంగా లేవని, వైద్యులు సమయపాలన పాటించడం లేదంటూ గ్రామస్తులు బుధవారం ఆస్పత్రికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఉదయం 10 గంటలు దాటినా కూడా వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆస్పత్రికి హాజరుకావడం లేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర చికిత్స కోసం వచ్చిన రోగులు గంటల తరబడి ఆస్పత్రి బయట వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు చిన్నారులతో వచ్చిన కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యకేంద్రంలో క్రమం తప్పకుండా వైద్యులు, నర్సులు హాజరు కావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు వచ్చి మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలపడంతో గ్రామస్తులు తాళం తీశారు. కాగా ఆటో బోల్తా పడిన ఘటనలో ఐదుగురి ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలు కాగా వైద్యం కోసం ఆజంనగర్ ఆస్పత్రికి రాగా వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించారు.
రామప్ప టెంపుల్ అద్భుతం


