క్రీడాపోటీల్లో దివ్యాంగుల ప్రతిభ
ఏటూరునాగారం: జిల్లాలోని భవిత కేంద్రంలో చదువుకుంటున్న దివ్యాంగులు క్రీడాపోటీల్లో సత్తా చాటారు. హైదరాబాద్‌లోని దోమలగూడలో గల వ్యాయామ విద్య కళాశాలలో దివ్యాంగ చిన్నారులకు మంగళవారం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఏడు పతకాలను కై సవం చేసుకున్నారు. ఇది ఎంతో గర్వకారణమని భవిత సెంటర్ల జిల్లా కోఆర్డినేటర్ సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటూరునాగారంలోని భవిత సెంటర్‌కు చెందిన దివ్యాంగ బుద్ధిమాద్యుడు మైకల్ అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి పరుగుపందెం, లాంగ్‌జంప్, డిస్కస్ త్రోలో మొదటి బహుమతిగా గోల్డ్‌మెడల్ సాధించారని తెలిపారు. అలాగే షాట్‌పుట్‌లో మైకల్‌కు తృతీయ బహుమతిగా సిల్వర్ మెడల్ సాధించాడని వివరించారు. అలాగే మరో విద్యార్థి చెవిటి మూగ విభాగంలో మెట్టు శివకృష్ణ పరుగు పందెం, లాంగ్ జంప్‌లో మొదటి బహుమతిగా గోల్డ్‌మెడల్ సాధించగా, షాట్‌పుట్‌లో తృతీయ బహుమతిగా సిల్వర్ మెడల్ సాధించినట్లు వివరించారు. అలాగే చెవిటి మూగ విభాగంలో డ్యాగల భానుప్రసాద్‌కు ప్రోత్సాహక బహుమతులు సాధించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్‌పీలు స్వరూపరాణి, గొర్రె రమేష్, పులి సుమ, కంకల రమేశ్ పాల్గొన్నారు.


