
ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికుల సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కారం అవుతా యని ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఏరియాలోని కేటీకే ఒకటో గనిలో శుక్రవారం గేట్ మీటింగ్ నిర్వహించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన ఏఐటీయూసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. స్ట్రక్చర్ కమిటీ సమావేశాలలో జరిగిన ఒప్పందాలను అమలు చేయించడంలో గుర్తింపు సంఘం దృష్టి సారించడం లేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే నిరసన కార్యక్రమాలు చేపట్టడం కాదని.. పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. వివిధ యూనియన్‌ల నుంచి సీఐటీయూలో చేరిన కార్మికులకు రాజిరెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజయ్య, సాయిలు, రమేష్ పాల్గొన్నారు.