
ఒప్పందాలను అమలు చేయాలి
భూపాలపల్లి అర్బన్: గత స్ట్రక్చర్ సమావేశాల్లో జరిగిన ఒప్పందాలకు సర్కులర్ జారీ చేసి సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఏరియాలోని కేటీకే 1వ గనిలో సోమవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాజ్‌కుమార్ హాజరై మాట్లాడారు. గతంలో సింగరేణి యాజమాన్యంతో మూడుసార్లు స్ట్రక్చర్ మీటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అందులో ఒప్పుకున్న సమస్యలను యాజమాన్యం పరిష్కరించలేదన్నారు. అప్పటివరకు సీఎండీతో జరిగే స్ట్రక్చర్ సమావేశాలను బహిష్కరించినట్లు చెప్పారు. కార్మిక సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. కార్మికులకు రావలసిన వాస్తవ లాభాలు ప్రకటించి వెంటనే మెరుగైన లాభాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని మానుకొని తక్షణమే సమస్యలను పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.