
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
భూ నిర్వాసితులకు పట్టాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి/గోవిందరావుపేట: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని వెంగ్లాపూర్, గోనెపల్లిలోని లబ్ధిదారులకు మంత్రి సీతక్క సోమవారం ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇళ్లు రాని లబ్ధిదారులు ఆందోళన చెందవద్దన్నారు. విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. నార్లాపూర్‌లో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఇంజనీర్స్‌డేను పురస్కరించుకుని ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, డీఈ నాగేశ్వర్‌రావు, మేడారం జాతర చైర్మన్ లచ్చుపటేల్ పాల్గొన్నారు. అనంతరం గోవిందరావుపేట మండల పరిధిలోని మోట్లగూడెం, తపమంచ, ప్రాజెక్ట్ నగర్ గ్రామాలకు చెందిన అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ పట్టాలను కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సురక్షిత ప్రాంతాల్లోనే ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మొదటి దపాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. లబ్ధిదారులు నిర్ణీత సమయంలో ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు రాని అర్హులైన లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని, దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవరాజ్, ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
మంత్రి సీతక్క
ములుగు రూరల్: ములుగు మండల పరిధిలోని ఇంచర్ల శివారులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములిచ్చిన నిర్వాసితులకు భూ పట్టాలను మంత్రి సీతక్క, ఎంపీ బలరా నాయక్‌లు కలెక్టర్ దివాకరతో కలిసి పంపిణీ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రైతులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో భాగంగా భూములను పరిశ్రమ నిర్మాణానికి ఇచ్చి సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. భూమి కోల్పోయిన రైతులకు ఏకో పార్కు సమీపంలో ప్రతీ రైతుకు 20 గుంటల భూమి పట్టాలను అందించినట్లు వివరించారు. రైతులు ముందుకొచ్చి ఆయిల్ పామ్ సాగుకు ముందుకొస్తే సబ్సిడీపై మొక్కలు అందించడంతో పాటు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనంతరం మేడారం మహాజాతర ఏర్పాట్లపై మంత్రి మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా జాతర పనులు చేపడుతామని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు