
ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
ములుగు రూరల్: రేపు(బుధవారం) తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్కను ముఖ్య అతిథిగా కేటాయించినట్లు వెల్ల డించారు. ఈ మేరకు సీతక్క ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేయనున్నట్లు వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ములుగు రూరల్: విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ ఏఈ రవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు(మంగళవారం) ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరమ్మతు పనుల్లో భాగంగా ములుగులో 11 కేవీ, ములుగు ఫీడర్–1 పరిధిలో శాంతిస్తూపం, లక్ష్మీనగర్, మంజునాథపురం ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని వివరించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రైవేట్ కళాశాలలు మూతపడుతున్నాయని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రాచారి సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వం మూడేళ్లుగా కళాశాలలకు రూ.8 వేల కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్ చెల్లించని కారణంగా నేడు కళాశాలలు బంద్ చేస్తున్నారని తెలిపారు. ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు కళాశాలల ఫీజులు, హాస్టల్ ఫీజులు భరించలేక చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని వివరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఆరోగ్య శ్రీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలో ఓ కార్యదర్శి పంచాయతీ ‘నిధులు దుర్వినియోగం’పై సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా నిఘావర్గాలు, ఆ శాఖ అధికారులు ఆరాతీశారు. మండలంలోని ఏ పంచాయతీ కార్యదర్శి అంటూ చర్చనీయాంశంగా మారింది. ఆ కార్యదర్శి సొంతానికి పంచాయతీ నిధులు రూ.లక్షల్లో వాడుకున్నట్లు సమాచారం. ఆ గ్రామ పరిధిలో ఇసుక క్వారీల వద్ద గ్రామ అభివృద్ధికి సేకరించిన డబ్బుల లెక్కల్లో తేడాలు ఉన్నట్లు తెలిసింది. ఆ గ్రామ యువత కార్యదర్శిపైన కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.
ఎంపీడీఓకు ఆర్‌టీఐ దరఖాస్తు
మహదేవపూర్ మండలం సూరారం గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై మహదేవపూర్ ఎంపీడీఓ రవీంద్రనాథ్‌కు గ్రామ యువత ఆర్‌టీఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా వివరాలు ఇవ్వాలని సోమవారం దరఖాస్తు చేసింది. 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీకి వచ్చిన నిధులు, ఖర్చులు, వాటి వివరాలను సర్టిఫైడ్ బిల్లులు అందజేయాలని యువకులు కోరారు.
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృత్తి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు ఉంటాయని ఏరియా అధికార ప్రతినిధి మారుతి తెలిపారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన వృత్తి శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందిన మహిళలకు సోమవారం రాత పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మారుతి హాజరై పరీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడారు. మహిళలు శిక్షణ పొందిన తర్వాత స్వయంగా ఉపాధి మార్గాలను అన్వేషించాలని సూచించారు. సింగరేణి యాజమాన్యం సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కోఆర్డినేటర్ శివకుమార్, ఏరియా కోఆర్డినేట్ అధికారి శ్రావణ్‌కుమార్, సేవా కార్యదర్శి రుబీనా, సేవా సభ్యులు, ఫ్యాకల్టీలు పాల్గొన్నారు.

ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి