
హేమాచలక్షేత్రంలో కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచల కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి తిలతైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు.