నేడు మేడారంలో పర్యటించనున్న మంత్రి సీతక్క | - | Sakshi
Sakshi News home page

నేడు మేడారంలో పర్యటించనున్న మంత్రి సీతక్క

Sep 15 2025 8:31 AM | Updated on Sep 15 2025 8:31 AM

నేడు

నేడు మేడారంలో పర్యటించనున్న మంత్రి సీతక్క

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో నేడు(సోమవారం) రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటించనున్నారు. మేడారాన్ని సందర్శించి మహాజాతర ఏర్పాట్లను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. పూజారులతో ప్రత్యేక సమావేశం కానున్నట్లు తెలిసింది.

జీఓ నంబర్‌ 64ను

రద్దుచేయాలి

ఏటూరునాగారం: జీఓ నంబర్‌ 64ను రద్దు చేసి గిరిజన సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్‌ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకట్‌రెడ్డి అన్నారు. సీపీఎం, డైలీవేజ్‌ వర్కర్ల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ఆదివారానికి మూడో రోజుకు చేరుకుంది. మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట చేపట్టిన సమ్మెకు వెంకట్‌రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. కలెక్టర్‌ సర్కులర్‌ ప్రకారం వేతనాలు చెల్లించాలని, జీతాలు తగ్గిస్తూ ఇచ్చిన జీవో నంబర్‌ 64ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని, హాస్టల్‌ వర్కర్లు రెండు రోజులుగా ఐటీడీఏ ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెల జయలక్ష్మి, కొప్పుల కమల, సంతోష్‌, సత్యం, సాంబయ్య, మాణిక్యం, రమణయ్య పాల్గొన్నారు.

దసరా ఉత్సవ కమిటీ

అధ్యక్షుడిగా గండ్రకోట కుమార్‌

ములుగు రూరల్‌: జిల్లా కేంద్రంలో అక్టోబర్‌ 2న నిర్వహించనున్న దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలకు అధ్యక్షుడిగా గండ్రకోట కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా శివాజీ, ఓడ రాజు, దేవేందర్‌, రమేష్‌, నరేందర్‌రెడ్డి, సంపత్‌, సురేశ్‌, శ్రీహరి, కార్యదర్శులుగా లకావత్‌ రాజు, గందె రాజు, పవన్‌, శ్రీనాధ్‌, కోశాధికారిగా జనార్ధన్‌, నాగరాజు, కన్వీనర్‌గా పాడ్య కుమార్‌లను ఎన్నుకున్నారు.

రోడ్ల మరమ్మతులకు రూ.20.40 లక్షలు మంజూరు

మంగపేట: మండల పరిధిలోని ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుతో పాటు మంగపేట నుంచి కాటాపురం వెళ్లే రోడ్డు, కాజ్‌వేల మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.20.40 లక్షల ప్లడ్‌ డ్యామేజ్‌ నిధులను కేటాయించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు రోడ్లు, కల్వర్టులు కోతకు గురికావడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు రూ. 5కోట్లు మంజూరు చేసింది. ఇదే క్రమంలో ఈ నెల 6వ తేదీన ప్రయాణం సాహసమే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క మండలానికి రూ.20.40లక్షల నిధులు కేటాయించగా మండల ప్రజలు సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు సైతం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌ తెలిపారు. ఏరియాలోని మిలీనియం క్వార్టర్స్‌ సమీప నర్సరీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి సీఎండీ ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వలనే వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సూచించారు. మొక్కలు నాటడం వలన భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడుతాయన్నారు. తాను స్వయంగా 20,377 మొక్కలు నాటినట్లు తెలిపారు. ఆదివారం 377 మొక్కలను సీఎండీ నాటారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్‌ సూర్యనారాయణ, జీఎం రాజేశ్వర్‌రెడ్డి, ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.

నేడు మేడారంలో పర్యటించనున్న మంత్రి సీతక్క
1
1/2

నేడు మేడారంలో పర్యటించనున్న మంత్రి సీతక్క

నేడు మేడారంలో పర్యటించనున్న మంత్రి సీతక్క
2
2/2

నేడు మేడారంలో పర్యటించనున్న మంత్రి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement