
ప్రయాణం సాహసమే..
వాహనాల రద్దీ
భారీ గుంతలతో ప్రయాణికుల ఇక్కట్లు
మంగపేట: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం నుంచి మంగపేట మండలంలోని జిల్లా సరిహద్దు గ్రామం బ్రాహ్మణపల్లి వరకు ప్రధాన రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రాహ్మణపల్లి నుంచి ఏటూరునాగారం ఎన్‌హెచ్ 163 వరకు 34 కిలోమీటర్ల ఏటూరునాగారం– బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి అత్యంత ప్రమాదకరంగా తయారైంది.
నిర్లక్ష్యమే పాపం..
మండలం నుంచి ఏటూరునాగారం వరకు ప్రధాన రోడ్డు అభివృద్ధి కోసం నాటి ప్రభుత్వం 2019 నుంచి 2021 వరకు పలు దఫాలుగా సుమారు రూ.20 కోట్లకుపైగా మంజూరు చేసింది. అప్పటి అధికార పార్టీ అండదండలతో టెండరు పొందిన గుత్తేదారుతో సంబంధిత అధికారులు కమీషన్ల కోసం కుమ్మక్కై పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుపై ఏర్పడిన గోతులను పూడ్చకుండా ఆర్‌ఆండ్‌బీ అధికారులు పట్టింపులేనట్లుగా వ్యవహరించడం, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహించడంతో సైడ్‌బర్మ్‌లు కోతకు గురై గోతుల ఏర్పడ్డాయి. మంగపేట రైతువేదిక వద్ద కల్వర్టు పక్కన రెండు చోట్ల 15 మీటర్ల వెడల్పుతో సుమారు 4 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడింది. అదే చోట రోడ్డు మధ్యన, కోమటిపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలో పలు చోట్ల మోకాలు లోతుతో 10 మీటర్ల వెడల్పుతో భారీగోతులు ఏర్పడి నీరు నిలిచి ఉంటున్నాయి.
మల్లూరు, వాడగూడెం ఇసుక క్వారీలతోపాటు పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, మణుగూరు 10కి పైగా ఇసుక క్వారీల నుంచి నిత్యం వందల సంఖ్యలో లారీలు వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఇసుకను రవాణా చేస్తున్నాయి. వరంగల్ నుంచి నిత్యం ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, లారీలు, డీసీఎంలు, కార్లు ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాలు, మండలం మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, పట్టణాలతోపాటు ఖమ్మం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వరకు రేయింబవళ్లు ప్రధాన రోడ్డుపై రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీగా ఉంటుంది. ఇసుక లారీల కారణంగా రోడ్డుపై భారీగోతులు ఏర్పడి నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి.
నిత్యకృత్యంగా మారి ప్రమాదాలు
చోద్యం చూస్తున్న
ఆర్‌అండ్‌బీ అధికారులు

ప్రయాణం సాహసమే..