
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
ములుగు: విద్యార్థులు, సమాజ భవిష్యత్ ఉపాధ్యాయుల చేతిల్లోనే నిర్మాణం అవుతుందని కలెక్టర్ దివాకర టీఎస్ పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో నిర్వహించిన గురుపూజోత్సవానికి జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి అధ్యక్షత వహించగా కలెక్టర్ దివాకర టీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసంద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంచి సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని సూచించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో సేవలందిస్తున్న ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయమన్నారు. విద్యార్థుల అభివృద్ది కోసం ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంపత్‌రావు, చైర్మన్ రేగ కల్యాణితో కలిసి కలెక్టర్ దివాకర జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 33 మందిని సత్కరించి అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి సూర్యనారాయణ, సమగ్ర శిక్షా కోఆర్డినేటర్లు అర్షం రాజు, కాటం మల్లారెడ్డి, గుళ్లపెల్లి సాంబయ్య, మండల విద్యాధికారులు, అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర టీఎస్
33 మంది జిల్లా
ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం