
గుంతలో దిగబడిన 108 వాహనం
వెంకటాపురం(కె): మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామ సమీపంలో ఆర్‌ఆండ్‌బీ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలో 108వాహనం శనివారం రాత్రి రెండు గంటల సమయంలో దిగబడింది. వివరాల్లోకి వెళ్లే.. బోదాపురం గ్రామ సమీపంలోని ఇసుక రీచ్ వద్ద లారీ డ్రైవర్ పాము కాటుకు గురయ్యాడు. గమనించిన లారీ డ్రైవర్లు 108 సిబ్బందికి సమాచారం అందించగా వారు పాము కాటుకు గురైన డ్రైవర్‌ను తీసుకువచ్చేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనం రామచంద్రాపురం గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా లారీలు అడ్డురావడంతో పక్క నుంచి వెళ్తున్న 108వాహనం గుంతలో దిగబడింది. దాన్ని బయటకు తీసేందుకు 108 సిబ్బంది, గ్రామస్తులు గంటపాటు శ్రమించి బయటకు తీశారు. అనంతరం బోదాపురం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో స్థానిక ఎస్సైకి సమాచారం అందించారు. దీంతో ఆలుబాక గ్రామానికి చెందిన ముస్తాఫా పాము కాటుకు గురై న డ్రైవర్ పాషాను ద్విచక్రవాహనంపై రామచంద్రాపురం తీసుకొచ్చి 108 వాహనం ఎక్కించారు. దీంతో సిబ్బంది పాషాకు వాహనంలో చికిత్స అందిస్తూ వెంకటాపురం వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం అందించగా కోలుకుంటున్నాడు.
గంటపాటు శ్రమించి బయటకు తీసిన
సిబ్బంది, గ్రామస్తులు