
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల్లో హేమాచలగుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించిన పూజారులు స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేసి వేద మంత్రోచ్ఛరణతో ఆశీర్వచనం ఇచ్చారు.