
అధికారుల సూచనలు పాటించాలి
ములుగు రూరల్/వెంకటాపురం(ఎం): జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున ప్రజలు, వాహనదారులు అధికారుల సూచనలు పాటించాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఈ మేరకు కలెక్టర్ గురువారం వరద ప్రాంతాల్లో పర్యవేక్షించారు. అనంంతరం ఆయన మాట్లాడుతూ రోడ్లపై వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల వైపునకు వాహనదారులు వెళ్లకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎగువ ప్రాంతాల్లో నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై వరద ప్రవాహం ఉన్న ప్రాంతాలలో ప్రయాణాలను నివారించేందుకు ట్రాక్టర్లు, ఇతర వాహనాలను అడ్డుగా ఏర్పాటు చేయాలన్నారు. వర్షాల దృష్ట్యా తక్షణ సాయం కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18004257109కు సమాచారం అందించాలన్నారు.
డీడీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాల ఏర్పాటు
అకాల వర్షాలతో ఎదురయ్యే విపత్కర పరిస్థితులు ఎదుర్కునేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని ఎస్పీ శబరీశ్ తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు వరద ప్రాంతాల్లో ఆయన పర్యటించి పోలీసు అధికారులకు పలు సూచనలు అందించి ప్రజలను, వాహనదారులను అప్రమత్తం చేశారు.
సంస్కృతికి ప్రతీక తీజ్
బంజారా, లంబాడీల సంస్కృతీసంప్రదాయానికి తీజ్ పండుగ ప్రతీక అని కలెక్టర్ దివాకర తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో డీఎఫ్‌ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ మహేందర్‌జీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లంబాడీల ఆచార సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని తరతరాలకు అందించడం అభినందనీయమన్నారు. తీజ్ పండుగ వేడుకలు సామాజిక ఐక్యతకు, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకలని పేర్కొన్నారు. తీజ్ ఉత్సవాలతో సమాజంలో ఆనందం, ఐక్యత పెరుగుతాయని వివరించారు.
రైతులందరికీ యూరియా అందిస్తాం
జిల్లాలో పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ యూరియా అందిస్తామని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయాన్ని ఆయన గురువారం తనిఖీ చేసి ఇప్పటి వరకు రైతులకు అందించిన యూరియా రికార్డులను పరిశీలించారు.
కలెక్టర్ దివాకర

అధికారుల సూచనలు పాటించాలి