
కోలీవుడ్ సీనియర్ నటుడు రాజేశ్ (Tamil actor Rajesh) (75) ఇటీవలే కన్నుమూశారు. మే 29న ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యంలోనే మరణించారు. చలనచిత్రపరిశ్రమలో 50 ఏళ్లకు పైగా రాణించిన ఆయన ఎప్పటికైనా ఓ సినిమా డైరెక్ట్ చేయాలని కల కన్నాడు. కానీ, అది నెరవరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే అధునాతన వైద్యాన్ని కాదని సిద్ధ వైద్యం తీసుకోవడం వల్లే రాజేశ్ చనిపోయాడని ప్రచారం జరిగింది.
సిద్ధ వైద్యం తీసుకోవడం వల్లే?
ఆస్పత్రిలో చేరడానికి ముందు సిద్ధ వైద్యుడితో నటుడు గంటల తరబడి గడిపాడని రాజేశ్ సోదరుడు చేసిన కామెంట్లతో ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రచారంపై నటుడు రాజేశ్ కూతురు దివ్య స్పందించింది. మా నాన్న ట్రీట్‌మెంట్ గురించి తప్పుడు ప్రచారం చేయడం ఇంతటితో ఆపండి. ఈ వదంతులు మమ్మల్ని మరింత బాధిస్తున్నాయి. దయచేసి ఈ సమయంలో మా కుటుంబాన్ని ప్రశాంతంగా వదిలేయండి.
నిజమెంత?
మా నాన్న సిద్ధ వైద్యమే కావాలని.. మరొకటి వద్దని మొండిగా వ్యవహరించాడని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. కాకపోతే ఓ సిద్ధ వైద్యుడు మా నాన్నను రెగ్యులర్‌గా చెక్ చేస్తుండేవాడు. ఆరోజు నాన్న శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని సిద్ధ వైద్యుడే గమనించి చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాం. కానీ దారిలోనే కన్నుమూశాడు. దయచేసి ఏది నిజం? ఏది అబద్ధం? అనేది తెలుసుకుని మాట్లాడండి అని చెప్పుకొచ్చింది.
ఎవరీ రాజేశ్?
రాజేశ్ తమిళనాడు వాసి. దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అవల్ ఒరు తొడరకథై’ (అంతులేని కథ) చిత్రంతో రాజేశ్ సినీప్రస్థానం మొదలైంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాలు చేశారు. తెలుగులో బంగారు చిలక, చాదస్తపు మొగుడు, మా ఇంటి మహారాజు, రుద్రుడు సినిమాల్లో నటించారు. హీరో నుంచి క్యారెక్టర్ యాక్టర్ వరకు వివిధ పాత్రలు పోషించారు . 1985లో సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ఒక బంగ్లాను నిర్మించిన తొలి తమిళ నటుడిగా గుర్తింపు పొందారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా అలరించారు. కార్తిగై దీపం సీరియల్‌లో యాక్ట్ చేశారు. ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా!
చదవండి: అఖిల్ రిసెప్షన్‌లో సింపుల్‌గా మహేశ్.. ఆ టీ షర్ట్ ధర లక్షల్లో..!