వరుణ్ సందేశ్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘నా వైఫ్ మిస్సింగ్’ అనే టైటిల్ ఖరారైంది. ‘నయనం’ వెబ్ సిరీస్ ఫేమ్ దర్శకురాలు స్వాతి ప్రకాశ్ మంత్రిప్రగడ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆహా సమర్పణలో కొమర మీడియా వర్క్స్ పతాకంపై శివ కంఠంనేని, ఆర్. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి నటుడు–నిర్మాత, ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సి. కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో చక్కటి ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: సతీష్ కుమార్ ఎన్‌ఎస్.


