చిక్కుల్లో సూర్య సినిమా.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్‌! | Trisha Krishnan, Suriya Karuppu Movie Moring Shows cancelled, This Is The Reason | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో సూర్య సినిమా.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్‌!

May 14 2026 1:53 PM | Updated on May 14 2026 3:03 PM

Trisha Krishnan, Suriya Karuppu Movie Moring Shows cancelled, This Is The Reason

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్యకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆయన నటించిన తాజా చిత్రం కరుప్పు (తెలుగులో వీరభద్రుడు)  నేడు(మే 14) ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా... అనూహ్యంగా మార్నింగ్‌ షోలు రద్దయ్యాయి. అంతేకాదు ఆమెరికా షోలు కూడా క్యాన్సిల్‌ అయ్యాయి. మార్నింగ్‌ షోలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నుంచి అనుమతి వచ్చినా కూడా ఎందుకు రిలీజ్‌ కాలేదు?  అసలు సమస్య ఏంటి? వివరాల్లోకి వెళితే..

సూర్య,త్రిష జంటగా నటించిన కరుప్పు చిత్రానికి ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మాతలు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించారు. మార్నింగ్ షోల కోసం సీఎం విజయ్‌ నుంచి పర్మిషన్‌ కూడా తెచ్చుకున్నారు. 

విజయ్‌ సీఎం అయ్యే ముందు వరకు తమిళనాడులో మార్నింగ్ షోస్ లేవు. పదకొండున్నర గంటలు దాటిన తర్వాత థియేటర్లలో బొమ్మ పడేది. విజయ్ వచ్చాక ఉదయం తొమ్మిది గంటలకు షోలు వేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు జీవో కూడా జారీ చేశారు. అయినా కూడా మార్నింగ్‌ షోలు పడలేదు. కారణం ఫైనాన్షియల్ ఇష్యూస్.  

రూ. 10 కోట్ల బకాయిలు.. 
ఏ సినిమా అయినా సరే.. విడుదలకు ముందే ఫైనాన్స్‌ క్లియర్‌ చేయాలి. లేదంటే షోలను నిలిపివేస్తారు.లీగల్‌ సమస్యలు కూడా వస్తాయి. కరుప్పు విషయంలో ఇప్పుడిదే జరిగింది. సినిమాకు సంబంధించిన ఫైనాన్స్‌ని పూర్తిగా క్లియర్‌ చేయకుండానే రిలీజ్‌కి వచ్చారట. రూ. 10 కోట్లకు పైగా బకాయిలు చెల్లించలేదట. దీనిపై బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు  జరిపిన చర్చలన్నీ విఫలం అవ్వడంతోనే మార్నింగ్‌ షోలు క్యాన్సిల్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బకాయిల చెల్లింపులకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇవి పరిష్కారమైతేనే తదుపరి షోలు ప్రదర్శించే అవకాశం ఉంది.

నా దగ్గర సమాధానం లేదు : ఆర్‌జే బాలాజీ
మార్నింగ్‌ షో రద్దుపై దర్శకుడు ఆర్‌జే బాలాజీ ఎక్స్‌వేదికగా స్పందిస్తూ ఎమోషనల్‌ అయ్యాడు. ‘సూర్య అభిమానులకు నేను క్షమాపణలు కోరుతున్నా. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. సినిమా విడుదలకు ముందు ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల షోలు రద్దయ్యాయి. ప్రస్తుతం ఉన్న సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాను. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సినిమా కచ్చితంగా విడుదలవుతుంది. మీరందరూ పడుతున్న ఇబ్బందికి నేను క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి సాయంత్రం షో అయినా పడుతుందా లేదా రిలీజ్‌ వాయిదా పడుతుందో చూడాలి. 

Advertisement
 
Advertisement
Advertisement