
నటి త్రిష.. తొలుత తమిళంలో జోడి అనే చిత్రంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలో నటించారు. ఆ తర్వాత సూర్యకు జంటగా మౌనం పేసియదే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత విక్రమ్ సరసన నటించిన సామి చిత్రం త్రిషను స్టార్ హీరోయిన్ చేసింది. అంతే ఆ తరువాత కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవలసిన ఈ బ్యూటీకి కలగలేదు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అంటూ అన్ని భాషలలో నటిస్తూ అగ్ర కథానాయకిగా మారారు.
ఈ 42 ఏళ్ల చెన్నై సుందరి ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడం గమనార్హం. అదేవిధంగా కథానాయకిగా 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు. చాలామంది హీరోయిన్ల మాదిరిగానే త్రిష కెరీర్లోను చాలా ఎత్తు పల్లాలు చోటుచేసుకున్నాయి. అలా పడి లేస్తూ తన కెరీర్‌ను పదిల పరుచుకుంటూ వస్తున్న త్రిష ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె సూర్యకు జంటగా నటిస్తున్న కరుప్పు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని దీపావళి సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న విశ్వంభర చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్‌లో బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం ఈమె చేతిలో కొత్త చిత్రాలు ఏమీ లేవు.
ఇదిలా ఉంటే త్రిష త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటుడు విజయ్ త్రిషకు మంచి మిత్రుడు. అయితే స్నేహబంధం కొందరు వేరే విధంగా కూడా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి 2026లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
కాగా ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో 25 ఏళ్ల సినీ కెరియర్ గాను నటి త్రిషకు స్పెషల్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తాను నటించిన ఒక్కో హీరో గురించి త్రిష మాట్లాడారు. నటుడు విజయ్ గురించి ఆమె మాట్లాడుతూ ఆయన నూతన పయనానికి గుడ్ లక్ అని పేర్కొన్నారు అదేవిధంగా విజయ్ కి ఎలాంటి కల ఉన్నా అది నెరవేరాలని, అందుకు ఆయన అర్హుడని, ఆయనకు తన శుభాకాంక్షలు అని అన్నారు. త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.