మన ‘చేతుల్లోనే’.. మన ఆరోగ్యం

Tollywood And Sports Celebrities Give Awareness Coronavirus In Hyderabad - Sakshi

సా​‍క్షి, హిమాయత్‌ నగర్‌:  మన ఒంటి శుభ్రమే కాదు. చేతుల శుభ్రం కూడా చాలా ముఖ్యం. రోజూ మనం ఎంతోమందిని కలుస్తుంటాం, ఎన్నో వస్తువుల్ని తాకుతుంటాం. దీంతో చేతుల్లోకి అనేక క్రిములు చేరుతాయి. శుభ్రం చేసుకోకపోతే అవి శరీరంలోకి వెళ్లి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది.  ‘కరోనా’ నేర్పిన పాఠం ఇదే.  ఈ క్రమంలో తాము నిత్యం హ్యాండ్‌వాష్‌ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నామంటూ పలువురు సినీ, స్పోర్ట్స్‌ స్టార్స్‌ ‘సాక్షి’తో ముచ్చటించారు.  

ప్రతి గంటకూ శుభ్రంచేసుకుంటా 
షూటింగ్స్‌ కారణంగా నా చేతుల్ని ప్రతి గంటకూ శుభ్రం చేసుకుంటుంటా. ఇంట్లో నుంచి షూటింగ్‌కి బయలుదేరే సమయంలో హ్యాండ్‌ వాష్‌ స్టార్ట్‌ చేస్తా. మరలా తిరిగి ఇంటికి వచ్చే వరకూ హ్యాండ్స్‌ని అవకాశాన్ని బట్టి ప్రతి గంటకూ సబ్బు, డెట్టాల్‌ లాంటి వాటితో శుభ్రం చేసుకుంటుంటా.  
–  రాశీఖన్నా, సినీ నటి.

ఇతరుల్ని నష్టపరచొద్దు 
ఇంటిలో ఉన్నప్పుడు హ్యాండ్‌వాష్, సోప్స్‌ని ఉపయోగిస్తా. లాక్‌డౌన్‌ సమయంలో ఎవ్వరినీ పెద్దగా కలిసేది లేదు కాబట్టి శానిటైజర్‌ రాసుకుంటూ ప్రతి రెండు గంటలకు హ్యాండ్‌ వాష్‌ చేసుకుంటూ ఉన్నా. మనవల్ల ఇతరులకు నష్టం కలగరాదు.  – సిమ్రన్‌ చౌదరి, సినీ నటి. 

పాటతో అవగాహన కల్పించిన చిరు, నాగ్‌ 
‘కరోనా’ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ‘కరోనా’పై పోరాటం చేయాలంటూ సంగీత దర్శకులు కోఠి సారధ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి, కింగ్‌ నాగార్జున పిలుపునిచ్చారు. ఇందుకోసం ‘లెట్స్‌ ఫైట్‌ దిస్‌ వైరస్, లెట్స్‌ కిల్‌ దిస్‌ వైరస్‌’ అంటూ ఓ పాటను రూపొందించారు. ఆ పాటలో చేతులను శుభ్రం చేసుకోవాలంటూ, ఈ సమయంలో షేక్‌హ్యాండ్స్‌కు దూరంగా ఉండాలంటూ చిరంజీవి, నాగార్జున, వరుణ్‌సందేశ్, సాయిధరమ్‌ తేజ, సంగీత దర్శకులు కోఠిలు డ్యాన్స్‌ రూపంలో చేసి చూపించారు. 

20 సెకండ్లపాటు శుభ్రం చేసుకుందాం 
స్పోర్ట్స్‌ పర్సన్‌గా చేతుల్ని ప్రతి సందర్భంలోనూ శుభ్రం చేసుకుంటుంటా. ఎన్నిసార్లు చేసుకుంటా అనేది లెక్కపెట్టలేదు. ఎంతోమందికి షేక్‌ హ్యాండ్స్‌ ఇస్తుంటా, బాల్స్‌ అండ్‌ బ్యాట్స్‌ పట్టుకుంటా కాబట్టి.. చేతుల్ని శుభ్రం చేసుకుంటుంటా. అందరూ 20 సెకండ్ల పాటు చేతుల్ని శుభ్రం చేసుకుందాం, శానిటైజర్‌ వాడదాం.  
– పీవీ సింధూ, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌

ఐదుసార్లు కంటే ఎక్కువనే 
ఆటకు ముందు ఆట తర్వాత ఇలా ప్రతిరోజూ ఐదుసార్లు కంటే ఎక్కువగానే నా చేతుల్ని శుభ్రం చేసుకుంటాం. హ్యాండ్‌బ్యాగ్‌లో చిన్నసైజ్‌ శానిటైజర్‌ని కూడా క్యారీ చేస్తా.   మన చేతుల్ని శుభ్రం చేసుకుంటుంటే పరిశుభ్రత మనవద్దనే ఉంటుంది. 
– సీ.ఏ.భవానిదేవి, ‘సబ్రే’(ఫెన్సర్‌) క్రీడాకారిణి

కుదిరినప్పుడల్లా శుభ్రం చేయాలి 
చేతుల్లో ఉన్న క్రిములు అంతం అవ్వాలంటే వీలు కుదిరినప్పుడల్లా చేతుల్ని సబ్బు, డెటాల్‌తో శుభ్రం చేసుకోవాలి. నేను ప్రతిరోజూ గంట గంటకూ డెటాల్‌తో నా చేతుల్ని శుభ్రం చేసుకుంటుంటా. మనతో పాటే చిన్నపాటి హ్యాండ్‌వాష్, శానిటైజర్‌ని క్యారీ చేద్దాం.  
–  హాసిని అన్వి, చైల్డ్‌ ఆర్టిస్ట్‌.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top