
కథ కుదిరింది... క్యాస్టింగ్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. ఆల్ సెట్ అనుకునే టైమ్‌లో అప్పటికే సెట్ అయిన హీరోయిన్ ‘ఊహూ’ అనేశారు. ఒకవేళ హీరోయిన్‌కి ఓకే అయినా... వేరేప్రాబ్లమ్ వల్ల దర్శక–నిర్మాతలు ‘ఊహూ’ అన్నా ఆమె ఆప్రాజెక్ట్‌లో కొనసాగలేని పరిస్థితి. ఇలా హీరోయిన్–డైరెక్టర్- ప్రోడ్యూసర్ ఎవరు ‘ఊహూ’ అన్నా ‘ఊ’ అనడానికి ఇంకో హీరోయిన్ ఉంటారు కదా... అలా ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో ఏయే కథానాయికలను వేరే కథానాయికలు రీప్లేస్ చేశారో తెలుసుకుందాం.
శ్రుతీ ఔట్ మృణాల్ ఇన్
ఇద్దరు మాజీ ప్రేమికులు తమకు ఇష్టం లేకపోయినా కలిసి ఓ క్రైమ్‌ను చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘డెకాయిట్’. ఈ చిత్రంలో మాజీ ప్రేమికులుగా అడివి శేష్, శ్రుతీహాసన్‌ని ఖరారు చేశారు. అయితే ఆ తర్వాత ఈ చిత్రానికే శ్రుతి మాజీ అయిపోయారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. దాంతో శ్రుతి స్థానంలో మృణాల్ ఠాకూర్‌ని తీసుకున్నారు.
షానిల్ డియో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ లవ్‌స్టోరీకి ‘ఏక్ ప్రేమ్ కథ’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. కాగా ఈ సినిమాలోని కొంత భాగం రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. అడివి శేష్ క్యారెక్టర్ మదనపల్లె యాస మాట్లాడుతుందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది.
శ్రీలీల నో... మీనాక్షీ చౌదరి.... భాగ్యశ్రీ ఎస్
యంగ్ సెన్సేషన్ శ్రీలీల చేతిలో నుంచి ఈ మధ్య ఒకటి కాదు రెండు సినిమాలు జారిపోయాయి. ఆ చిత్రాలు మీనాక్షీ చౌదరి, భాగ్యశ్రీ భోర్సేలకి చిక్కాయి. శ్రీలీల ఈ మధ్య తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాలకు ‘యస్’ చెప్పడంవల్ల రెండు తెలుగు సినిమాలకు ‘నో’ చె΄్పాల్సి వచ్చింది. ఆ ఆఫర్స్ మీనాక్షీ, భాగ్యశ్రీకి వెళ్లగానే ‘ఎస్’ అనేశారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం....
⇒ అనగనగా ఒక రాజు. ఆ రాజుగారికి ఒక రాణి ఫిక్స్ అయింది. కానీ ఆ తర్వాత రాజుగారిని రాణి వదులుకుంది. ఇదంతా నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందుతున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం గురించే. ఈ చిత్రంలో రాజు ఎవరో కాదు... నవీన్ అని ఊహించే ఉంటారు. ఆయన్ను పెళ్లాడే రాణిగా ముందు శ్రీలీలను తీసుకున్నారు. కానీ డేట్స్ క్లాష్ వల్ల ఈ చిత్రం నుంచి శ్రీలీల ఔట్. ఆమె స్థానంలోకి మీనాక్షీ చౌదరిని ఎంపిక చేసింది చిత్రబృందం.
కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. పెళ్లి నేపథ్యంలో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. శ్రీకర స్టూడియో సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి పర్ఫెక్ట్ అని యూనిట్ భావించడంవల్లే పండగకి పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమాని విడుదల చేయాలనుకుని ఉంటారు.
⇒ ఓ వారం రోజులు షూటింగ్‌లో పాల్గొని, ఆ తర్వాత ‘లెనిన్’ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు సమాచారం. కారణం ఇంతకుముందు చెప్పినట్లు వేరే చిత్రాల డేట్స్ ఈ సినిమాతో క్లాష్ కావడమే. అఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘లెనిన్’. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ తర్వాత తప్పుకున్న విషయాన్ని వెల్లడించలేదు. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ భోర్సేని నాయికగా తీసుకున్నారట. మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దీపికా ఔట్ త్రిప్తి ఇన్
‘కల్కి 2898ఏడీ’లో ప్రభాస్–దీపికా పదుకోన్ జంటగా నటించలేదు కానీ... ఈ ఇద్దరూ ‘స్పిరిట్’లో జోడీగా నటించనున్నారని వార్త వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ చిత్రం ప్రకటన ఎప్పుడో వచ్చింది. దీపికా పదుకోన్‌ని ఎంపిక చేశారనే టాక్ కూడా ఆ మధ్య ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ జోడీ సెట్ కాలేదు. తక్కువ పని గంటలు, ఎక్కువ పారితోషికం వంటి కారణాలతో దీపికా పదుకోన్ ఈప్రాజెక్ట్‌కి దూరమయ్యారనే వార్త వచ్చింది.
మరి... ఈ భామను రీప్లేస్ చేసే తార ఎవరు? అనే చర్చ జరిగిన నేపథ్యంలో ‘నా సినిమాలో ఫిమేల్ లీడ్ చేయబోయేది తనే’ అంటూ త్రిప్తీ దిమ్రీ పేరుని ప్రకటించారు సందీప్ రెడ్డి. రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘యానిమల్’లో చేసిన కీ రోల్ త్రిప్తీ దిమ్రీని బాగా పాపులర్ చేసింది. ఇప్పుడు మరోసారి సందీప్ దర్శకత్వంలో సినిమా అవకాశం రావడం పట్ల... అది కూడా హీరోయిన్ పాత్ర కావడంతో త్రిప్తీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబరులో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది.
పూజ ఔట్ శ్రీలీల.... మమితా ఇన్
సౌత్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి... ముఖ్యంగా తెలుగులో మంచి స్థాయికి ఎదిగిన పూజా హెగ్డేకి ఇప్పుడు టాలీవుడ్‌లో పరిస్థితులు అనుకూలిస్తున్నట్లుగా లేదు. పూజా కథానాయికగా నటిస్తారనుకున్న రెండు చిత్రాల అవకాశం వేరే నాయికలకు వెళ్లింది. ఆ వివరాల్లోకి వెళితే...
⇒ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ చిత్రంలో ముందు పూజా హెగ్డేని కథానాయికగా అనుకున్నారట. ఆ తర్వాత ఆమె స్థానంలోకి శ్రీలీల వచ్చారు. వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్ ΄్లాన్ చేసిన ప్రకారం జరగలేదు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఇన్‌వాల్వ్ కావడంవల్ల ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ డేట్స్ క్లాష్ వల్లే పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి ఔట్ అయ్యారని సమాచారం.
⇒ 2017 నుంచీ సినిమాలు చేసుకుంటూ వచ్చినప్పటికీ 2024లో విడుదలైన ‘ప్రేమలు’తో మమితా బైజు క్రేజ్ పెరిగిపోయింది. ఈ చిత్రం తర్వాత ఈ మలయాళ బ్యూటీకి అవకాశాలు పెరిగాయి. తాజాగా ధనుష్ సరసన నటించే అవకాశం మమితాకి దక్కింది. అది కూడా ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డేని కథానాయికగా తీసుకున్నారనే వార్త వచ్చింది. కారణాలు బయటకు రాలేదు కానీ పూజా హెగ్డేని మమితా రీప్లేస్ చేశారు. ఈ చిత్రానికి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు పూజా హెగ్డే విషయానికొస్తే... తమిళ, హిందీ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారామె.
ఒకర్ని అనుకున్నప్రాజెక్ట్‌లోకి మరొకరు రావడం అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్. ఒకవేళ ఆప్రాజెక్ట్ హిట్ అయితే, ‘ఔట్’ అయినవారికి కాస్త బాధ ఉంటుంది. అదే... ఫట్ అయితే ‘ఇన్’ అయినవాళ్లు ఫీలైపోతారు. రీప్లేస్ చేయడం ఎలా సాధారణమో హిట్టూ... ఫట్టూ కూడా సాధారణమే కాబట్టి.... కష్టాన్ని నమ్ముకుంటూ ముందుకు సాగడమే.
లేడీ డాన్ ఎవరు?
డాన్ అంటే షారుక్ ఖాన్ అన్నట్లుగా ‘డాన్, డాన్ 2’ చిత్రాలు ఫిక్స్ చేసేశాయి. ఆ చిత్రాల దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’ చిత్రంలో డాన్‌ని మార్చారు. ఆ కొత్త డాన్ ఎవరంటే... రణ్‌వీర్ సింగ్. అలాగే ఆ ‘డాన్’ చిత్రాల్లో ప్రియాంకా చోప్రా లేడీ డాన్‌గా చేశారు. ‘డాన్ 3’లో లేడీ డాన్ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. ఈ పాత్రకు కియారా అద్వానీని ఎంపిక చేశారు. అయితే కియారా ప్రస్తుతం గర్భవతి కావడంతో ఆమె స్థానంలో వేరే నాయికను తీసుకోవాలనుకుంటున్నారట. మెరుపు తీగలా కనిపించే కృతీ సనన్ అయితే లేడీ డాన్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటారని ఆమెను దాదాపు ఖరారు చేశారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ చిత్రం షూటింగ్‌ని జనవరిలో ఆరంభించాలనుకుంటున్నారట. ఈలోపు కియారా డెలివరీ కూడా అయిపోతుంది. సో... ముందు అనుకున్నట్లుగా ఆమెనే కథానాయికగా ప్రోసీడ్ అయితే అనే ఆలోచన కూడా చేస్తోందట యూనిట్. మరి... ఫైనల్‌గా కియారా... కృతీ.... ఈ ఇద్దరిలో లేడీ డాన్ ఎవరు? అనేది కొన్ని నెలలు ఆగితే తెలుస్తుంది.