
తెలుగు సినీ ప్రియులను వెండితెరపై అలరించిన కోటా శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కన్నుమూశారు. ప్రాణం ఖరీదు మూవీతో మొదలైన ఆయన జర్నీ.. వందలకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయనలా హాస్యం పండించడం, విలనిజం చూపించడం బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో అన్నంతలా తనలోని విలక్షణ నటనను వెండితెరపై చూపించారు. అయితే ఆయన చేసిన సినిమాల్లో అహ నా పెళ్లంట చిత్రానికి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
ఈ చిత్రంలో ఆయన చేసిన ఓ సీన్ ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుని గుర్తుండిపోయేలా ఉంటుంది. అది మరేదో కాదు.. కోటా శ్రీనివాసరావు నటించిన అహ నా పెళ్లంట చిత్రంలోని పిసినారి లక్ష్మీపతి పాత్ర. ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించారు. ఇందులో కోట తన పాత్రలో ఒదిగిపోయారు. బ్రహ్మానందంతో కలిసి ఆయన పండించిన కామెడీ చూస్తే నవ్వకుండా ఉండలేరు. అంతలా ఆ పాత్రలో మెప్పించారాయన.
కానీ ఆ పాత్రకు మొదట అనుకున్నది కోటాను కాదట. కథ రాసుకున్నప్పుడు లక్ష్మీపతి పాత్ర కోసం రావుగోపాలరావును అనుకున్నారట. అయితే అప్పటికే కోటా శ్రీనివాసరావు నటించిన మండలాధీశుడు చిత్రం విడుదల కావడంతో ఆ రోల్ను కోటతోనే చేయించాలని జంధ్యాల నిర్ణయించుకున్నారట. కానీ నిర్మాత డి.రామానాయుడు మొదట అందుకు ఒప్పుకోలేదని సమాచారం. ఆ తర్వాత పట్టుబట్టి మరి ఆయనను ఒప్పించారట.
