నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రల్లో వచ్చిన చిత్రం తెరచాప. ఈ మూవీకి జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. అనన్య క్రియేషన్స్ బ్యానర్‌పై కైలాశ్ దుర్గం నిర్మించారు. ఈ రోజు ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అసలు కథేంటంటే..
సమాజంలో తన ప్రజల కోసం పోరాడే నాయకుడైన కాశీ బాబు (నాగ మహేష్) అనుకోని పరిస్థితుల్లో మరణిస్తాడు. తనను ఎంతో ప్రేమించే తండ్రి కొడుకు నిర్లక్ష్య స్వభావం వల్ల చనిపోయాడని అందరూ అంటారు. అయితే తన తండ్రి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టడానికి ఈశ్వర్ (నవీన్ రాజ్) ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో సీత (శ్రీలు), గాయత్రి (పూజా సుహాసిని) పాత్ర ఏంటి? ఆనంద్ రాజు (రాజీవీ కనకాల), పుష్ప ఫేమ్ కేశవ పాత్ర ఎలా ఉంటుంది? అన్నదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. మత్స్యకారుల నేపథ్యం ఉన్న కథ అని ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. అయితే ఈ కథలో తండ్రి-కొడుకు మధ్య ఉన్న భావోద్వేగాన్ని పరిచయం చేశాడు డైరెక్టర్ జోయెల్ జార్జ్. తాను అనుకున్న కథను ఎక్కడా మిస్సవకుండా తెరపై ఆవిష్కరించాడు.
సెకండాఫ్‌లో యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కొన్ని సీన్స్ అనవసరంగా పెట్టారేమో అనిపిస్తాయి. దర్శకుడు తీసుకున్న కథనం బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లేపై మరింత దృష్టి పెట్టాల్సింది. మధ్య మధ్యలో కనిపించే రొటీన్ సన్నివేశాలు ప్రేక్షకుడికి కాస్తా చిరాకు తెప్పిస్తాయి. మొత్తానికి స్క్రీన్‌ప్లేలో లోపాలు ఈ కథకు పెద్ద మైనస్. ఓవరాల్‌గా ఓ ఆకట్టుకునే వాస్తవిక డ్రామాగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. . ఈ వీకెండ్‌కు తెరచాపను ఓసారి ట్రై చేయొచ్చు.
ఎవరెలా చేశారంటే..
గ్రామీణ యువకుడి పాత్రలో నవీన్ రాజ్ అద్భుతంగా ఒదిగిపోయాడు. మత్స్యకారుడిగా ఆయన లుక్ చాలా సహజంగా.. పాత్రకు తగినట్లుగా ఉంది. శ్రీలు, పూజా సుహాసిని తమ పాత్రల్లో మెప్పించారు. రాజీవ్ కనకాల, నాగ మహేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కేశవ బాగానే నటించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికంగా చూస్తే ప్రజల్ కృష్ణ అందించిన సంగీతం బాగుంది.. ఎంఎల్ రాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించింది. అజీమ్, వెంకట్ అందించిన సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. రాజు బోదాసింగి ఎడిటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి.
రేటింగ్: 2.5/5


