
ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల విడుదలైన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. నిర్మాతలు, బయ్యర్లు భారీగా నష్టపోయారు.అందుకే థియేటర్స్‌లో ఓ సినిమాను రిలీజ్ చేయాలంటే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం లేదు. ఒకవేళ జరిగిన లాభాలు లేకుండానే రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ సినిమా రిలీజ్‌కి ముందే రూ. 20 కోట్ల లాభాలను సంపాదించింది. అదే ‘మిరాయ్’.
ట్రైలర్‌తోనే...
హనుమాన్‌తో పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన తేజ సజ్జా నటించిన ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. విలన్‌గా మంచు విష్ణు, హీరో తల్లిగా శ్రియ నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. మూవీ విజువల్ వండర్‌లా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. వీఎఫెక్స్ అదిరిపోయింది. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలే వీఎఫెక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. మాత్రం ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినట్లు ట్రైలర్‌తోనే తెలిసిపోతుంది.
ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే..?
సెప్టెంబర్ 12న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే రిలీజ్‌కు ముందే ఈ చిత్రానికి భారీ లాభాలు వచ్చాయి. ఈ చిత్రానికి నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ. 45 కోట్ల ఆదాయం వచ్చిందట. రూ. 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్‌తో సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకోవడం లేదు. పెట్టిన ఖర్చును కూడా వెనక్కి తెచ్చుకోలేపోతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తేజ సజ్జా లాంటి కుర్ర హీరో సినిమా రిలీజ్‌కు ముందే లాభాలు తెచ్చిపెట్టడం టాలీవుడ్‌కి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.