
‘‘మిరాయ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది. ఈ చిత్రాన్ని గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. వాళ్ళ ఆదరణ వల్లే నేను సినిమాలు చేయగలుగుతున్నాను. ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నాను’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘మిరాయ్’. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో శ్రియ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది.
ఈ సందర్భంగా ‘బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్’ పేరిట శనివారం చిత్రయూనిట్ నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో తేజ సజ్జా మాట్లాడుతూ–‘‘దర్శకుడు కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్‌గార్లు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. మా మీద విశ్వప్రసాద్‌గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. మంచు మనోజ్‌గారి రాకతో మా సినిమా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ‘మిరాయ్’ కథ ప్రభాస్‌గారి వాయిస్ ఓవర్‌తో ప్రారంభమవ్వడం వల్లే మా సినిమాకు వెయిట్ వచ్చింది. మా సినిమాను సపోర్ట్ చేసిన ప్రభాస్, రానాగార్లకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని అన్నారు.
‘‘ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత సక్సెస్‌తో నా ఫోన్ మోగుతూనే ఉంది. నాకు ఇదంతా కలలా
ఉంది. ఈ కథలో నన్ను భాగం చేసిన కార్తీక్‌కు రుణపడి ఉంటాను. విశ్వప్రసాద్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. తమ్ముడు తేజ మంచి స్థాయికి వెళ్తాడు. మా అన్నతమ్ముళ్లు ఇద్దరి కోసం ప్రభాస్‌గారు నిలబడ్డారు (మంచు విష్ణు ‘కన్నప్ప’లో ప్రభాస్ కీలక పాత్రలో నటించారు). ఆయనకు థ్యాంక్స్’’ అని తెలిపారు మనోజ్ మంచు.
‘‘మిరాయ్’ నాలుగేళ్ల జర్నీ. తేజ అప్పట్నుంచి ట్రావెల్ అవుతున్నాడు. నన్ను నమ్మిన విశ్వప్రసాద్ గారికి, ఈ సినిమాలో భాగమైన అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు దర్శకుడు కార్తీక్. ‘‘2024 మాకు అంతగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో ‘మిరాయ్’ సక్సెస్ మాకు మరెన్నో సినిమాలు చేసే గొప్ప ఎనర్జీ ఇచ్చింది. గౌర హరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా తర్వాతి నాలుగు సినిమాలకు కూడా ఆయనే మ్యూజిక్ చేస్తున్నారు. మా అమ్మాయి కృతి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా తన జర్నీ మొదలుపెట్టి, ఈ సినిమాతో నిర్మాతగా మారారు. తను మా లక్కీ చార్మ్ అని భావిస్తున్నాం’’ అని తెలిపారు.