
హీరో విశాల్ (Vishal) వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. అంతేకాదు అనూహ్యంగా మెగాఫోన్ పట్టడం విశేషం. ప్రస్తుతం మగుడం అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట రవి అరసును దర్శకుడిగా అనుకున్నారు. ఏమైందో ఏమో కానీ, ఇప్పుడు ఈ చిత్ర దర్శకత్వం బాధ్యతలను విశాల్ తన భుజాన వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన దీపావళి పండగ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో ఇది అనుకోకుండా జరిగిన విషయం కాదని, ముందుగా నిర్ణయించుకున్న విషయమేనని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ సహకారంతోనే మగుడం చిత్రానికి దర్శకత్వం బాధ్యతలను చేపట్టినట్లు చెప్పారు.
దర్శకుడిగా..
ఈయన మొదట తుప్పరివాలన్– 2 చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. దానికంటే ముందే మగుటం చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇకపోతే ఈ చిత్రం తరువాత సుందర్.సీ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు వీరి కాంబోలో 12 ఏళ్ల క్రితం మదగజరాజా తెరకెక్కింది. ఈ మూవీ ఎన్నో ఏళ్ల జాడ్యం తర్వాత ఈ ఏడాది విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ హిట్ కాంబో మరో చిత్రానికి సిద్ధం అవుతోంది.
ఇద్దరు హీరోయిన్లు
సుందర్.సీ చిత్రాల్లో కమర్షియల్ అంశాలు మెండుగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్ల అందాల ఆరబోత కచ్చితంగా ఉంటుంది. వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో విశాల్‌కు జంటగా మిల్కీబ్యూటీ తమన్నా, క్రేజీ బ్యూటీ కయాదు లోహర్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.