
మిల్కీ బ్యూటీ తమన్నా చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. గతేడాది కేవలం ఐటమ్ సాంగ్స్‌లో మెరిసిన ముద్దుగుమ్మ.. ఈ సారి లేడీ ఓరియంటెడ్ మూవీతో అభిమానుల ముందుకు రానుంది. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఓదెల-2 ఈ వారంలోనే థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు.
రిలీజ్‌కు రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరోయిన్ తమన్నా కూడా హాజరైంది. ఈ సందర్భంగా తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది. టాలీవుడ్ హీరో శర్వానంద్‌తో కలిసి పని చేయాలని ఉందని తన మనసులో కోరికను బయటపెట్టింది. కాగా..ఈ ఈవెంట్‌కు శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తమన్నా మాట్లాడుతూ.. 'శర్వానంద్‌తో తాను ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఇప్పటివరకు కలిసి పని చేయలేదు. సంపత్‌నంది గారితో మీరు నెక్ట్స్ సినిమా చేయాలని కోరుకుంటున్నా. త్వరలోనే మీతో కలిసి సినిమా చేయాలని ఉంది' అని అన్నారు. కాగా.. అశోక్ తేజ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ థ్రిల్లర్ మూవీ ఈనెల 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.