మెగా ఫ్యామిలీలో ట్విన్స్ రాకతో సందడి నెలకొంది. సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు చెబుతున్నారు. జనవరి 31న ఉపాసనకు ఓ మగ, ఆడ శిశువు జన్మించారు. ఇదే విషయాన్ని అధికారికంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తల్లీ, ఇద్దరు బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేసింది. ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా ట్విన్స్ రాకతో సుస్మిత స్పందించారు.
మరోసారి అత్తయ్యను అయ్యాను
రామ్ చరణ్ దంపతులకు సుస్మిత కొణిదెల తన సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేసింది.2026 సంవత్సరం ప్రారంభం నుంచే తమ కుటుంబానికి ఆనందాన్ని తెచ్చిందని పేర్కొంది. సోదరుడు చరణ్, ఉపాసనలు తనను మరోసారి అత్తయ్యను చేశారని సంతోషంగా చెప్పుకొచ్చింది. అయితే, ఈసారి తన ఆనందం రెట్టింపుగా ఉందని సుస్మిత తెలిపింది.
మీ అన్నయ్య ఎదురుచూస్తున్నాడు
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో నటి లావణ్య త్రిపాఠి సంతోషం వ్యక్తం చేసింది. 'చిన్న కవలలకు స్వాగతం. మీరిద్దరూ ఇప్పటికే ఎంతో ప్రేమను పొందారు. క్లింకార ఇప్పడు అందరికంటే పెద్ద అక్కగా ప్రమోట్ అయిపోయింది. మీతో కలిసి ఆడుకునేందుకు మీ అన్నయ్య వాయువ్ ఎదురుచూస్తున్నాడు. రామ్ చరణ్, ఉపాసనలకు డబుల్ అభినందనలు' అంటూ లావణ్య ట్వీట్ చేసింది. లావణ్య, వరుణ్ దంపతులకు గతేడాదిలో వాయువ్ జన్మించిన విషయం తెలిసిందే.


