బాహుబలి పార్ట్1, పార్ట్ 2 కలిసి ‘బాహుబలి: ది ఎపిక్’( Baahubali: The Epic)పేరుతో రీరిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న ఈ చిత్రం థియేటర్స్లో సందడి చేయబోతుంది. ఆరున్నర గంటల నిడివిని 3:45 గంటలకు కుదించి ‘బాహుబలి: ది ఎపిక్’ని తీర్చిదిద్దారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సినిమాలోని యాక్షన్స్ సీన్స్ అన్నింటిని కవర్ చేస్తూ ట్రైలర్ని కట్ చేశారు. అయితే రెండు సినిమాల్లోని సగం సన్నివేశాలను తీసేస్తేనే రన్‌టైమ్ 3.45 గంటలకు చేరింది.
ఓ సినిమాకు ఇంత రన్‌టైమ్ ఉండడం కూడా ఇదే తొలిసారి. కానీ అంతకు మించి సన్నివేశాలను డిలీట్ చేసే అవకాశం లేదని రాజమౌళి అంటున్నారు. అప్పటికే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను లేపేశారట. అంతేకాదు సూపర్ హిట్ సాంగ్స్‌ని కూడా డిలీట్ చేసినట్లు రాజమౌళి చెప్పారు.
తాజాగా ఆయన ప్రభాస్(Prabhas), రానా(rana Daggubati)లతో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో బాహుబలి చిత్రాల షూటింగ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే బాహుబలి ది ఎపిక్ లో కనిపించని సన్నివేశాలు ఏంటో కూడా రాజమౌళి చెప్పారు.
ప్రభాస్-తమన్నాల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలను ‘ది ఎపిక్’లో చూడలేమట. అవంతిక లవ్‌స్టోరీ మొత్తాన్ని డిలీట్ చేసినట్లు రాజమౌళి చెప్పారు. అంతేకాదు పచ్చబొట్టేసిన, ఇరుక్కుపో, కన్నా నిదురించరా పాటలను కూడా తొలగించినట్లు రాజమౌళి పేర్కొన్నారు. యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా తొలగించామని రాజమౌళి అన్నారు. మొత్తంగా అవంతిక పాత్రకు సంబంధించిన సీన్లే ఎక్కువ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. పార్ట్ 1లో పచ్చబొట్టు పాటతో పాటు దానికి ముందు వచ్చే సీన్లు బాగా ఆకట్టుకున్నాయి.


