శ్యామ్‌ కె.నాయుడుతో ప్రాణహాని: నటి శ్రీసుధ

Sri Sudha Again Complaint To Police On Cinematographer Shyam K Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్‌ కె.నాయుడితో తనకు ప్రాణహాని ఉందని సినీ నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆయనపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు శుక్రవారం కంప్లైంట్‌ రాసిచ్చారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లు కలిసున్న తరువాత శ్యామ్‌ కె.నాయుడు తనను మోసం చేశాడంటూ గత ఏడాది మే 26న శ్రీసుధ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ విషయంలో తాను రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలను సృష్టించి కోర్టులో దాఖలు చేశారని, శ్యామ్‌ కె.నాయుడును ఇంత వరకు అసలు అరెస్టు కూడా చేయలేదని రెండోసారి తన ఫిర్యాదులో శ్రీసుధ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సినీ ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ సాయిరాం మాగంటి.. శ్యామ్‌ కె.నాయుడిపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని, రాజీ కుదుర్చుకోవాలని బెదిరించారని ఆమె వాపోయారు.

గత ఏడాది ఆగస్టు 5న మాదాపూర్‌లోని చిన్నా నివాసానికి తనను పిలిపించి శ్యామ్‌ కె.నాయుడు, చిన్నా, సాయిరాం మాగంటి తదితరులు బెదిరించడంతోపాటు దూషించారని, శారీరక దాడికి పాల్పడ్డారని తెలిపారు. సినీ పరిశ్రమలో కొనసాగాలంటే తప్పనిసరిగా రాజీ కుదుర్చుకోవాలని, విషయం బయటకు చెప్పొద్దని హెచ్చరించినట్లు చెప్పారు. తాను భయంతో అప్పటి నుంచి ముందుకు రాలేదని, ప్రస్తుతం తనకు శ్యామ్‌ కె.నాయుడు, అతని కుటుంబ సభ్యులు, మిత్రులతో ప్రాణహాని ఉన్నందున మరోసారి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు.

శ్రీసుధ తన ఫిర్యాదులో పేర్కొన్న చిన్నా నివాసం మాదాపూర్‌లో ఉండటంతో ఎఆర్‌నగర్‌ పోలీసులు శ్యామ్‌ కె.నాయుడు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ సాయిరాం మాగంటి తదితరులపై జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసు నమోదు చేశారు. ఈ కేసును మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top