అది మరచిపోలేని జ్ఞాపకం.. తెలుగు యంగ్ హీరోయిన్ కామెంట్స్ | Sakshi
Sakshi News home page

అది మరచిపోలేని జ్ఞాపకం.. తెలుగు యంగ్ హీరోయిన్ కామెంట్స్

Published Mon, Jan 1 2024 1:02 AM

Sivatmika Rajasekhar: farewell to 2023 and welcomes 2024 - Sakshi

‘‘నేను ఎప్పట్నుంచో స్కై డైవింగ్‌ చేయాలనుకుంటున్నాను. అది 2023లో నెరవేరింది. దుబాయ్‌లో అక్క(శివాని, నేను రెండు వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్‌ చేశాం. 2023 అనే కాదు.. నా జీవి తంలోనే నేను మరచిపోలేని జ్ఞాపకంగా ఈ స్కై డైవింగ్‌ అడ్వెంచరస్‌ను గుర్తు పెట్టుకుంటాను’’ అని హీరోయిన్‌ శివాత్మిక అన్నారు. 2023కి వీడ్కోలు పలుకుతూ 2024కి స్వాగతం పలుకుతున్న శివాత్మిక రాజశేఖర్‌ పంచుకున్న విశేషాలు...

► మీ జీవితంలో 2023 ఎలా గడిచింది?
చెప్పాలంటే... 2023 నాకు గొప్పగా గడిచింది. చాలా విధాలుగా కలిసొచ్చింది. నా కెరీర్‌ స్టార్టింగ్‌లోనే మంచి ప్రాజెక్ట్స్‌లో భాగమయ్యాననే భావన కలిగింది. ఎప్పట్నుంచో నేను చేయాలనుకుంటున్న పనులు ఈ ఏడాది జరిగాయి. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. నన్ను నేను మెరుగుపరచుకోవడం కోసం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నాను. కుటుంబం పరంగా కూడా బాగా గడిచింది. దేవుడి దయవల్ల, అదృష్టంగా 2023 నా జీవితంలో సంతోషంగా ముగిసింది. 

► ఈ ఏడాది మీ జీవితంలో జరిగిన చెడు ఘటనలు ఏవైనా ఉన్నాయా?
మంచి జరిగినట్లే... ప్రతి ఏడాది చెడు కూడా ఉంటుంది. అయితే కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టబోయే ఈ తరుణంలో వాటిని నేను గుర్తుతెచ్చుకోవాలనుకోవడం లేదు. 

► కొత్త ఏడాది కోసం మీరు తీసుకున్న కొత్త నిర్ణయాలు ఏంటి?
నా మనసును ఎక్కువగా ఫాలో అవుతూ వర్క్స్‌ చేస్తాను. ప్రతి అంశం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించేలా జీవిస్తాను. ఇలా గత ఏడాదిలో ప్రయత్నించి సంతోషంగా జీవనం సాగించాను. ఈ ఏడాది కూడా ఇదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. 

► 2024 మీ జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నారు?
పెద్దగా అంచనాలు ఏమీ పెట్టుకోవడం లేదు. ఫ్లోను బట్టి ముందుకెళ్తాను. అయితే అన్నీ మంచి, గొప్ప అంశాలే జరగాలని కోరుకుంటున్నాను. సంతోషంగా, హాయిగా, ఆరోగ్యకరంగా గడవాలని ఆశిస్తున్నాను.

► కొత్త ఏడాదిని ఎలా సెలబ్రేట్‌ చేసుకోబోతున్నారు?
కొత్త ఏడాది ఎప్పటిలానే అమ్మానాన్న(జీవిత, రాజశేఖర్‌), అక్క శివానీలతో హైదరాబాద్‌లోనే సెలబ్రేట్‌ చేసుకుంటున్నాను. నా స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ను కలుస్తాను. 

Advertisement
 
Advertisement