గంగ రంగంలోకి దిగి, ఏ రేంజ్‌లో విలన్ల భరతం పట్టాడో తెలుసుకోవాలంటే ‘భోగి’ సినిమా చూడాల్సిందే. గంగ ఎవరంటే హీరో శర్వానంద్. సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం క్లైమాక్స్‌ని ఇటీవల చిత్రీకరించారు. ఇందులో భాగంగా తెరకెక్కించిన భారీ యాక్షన్ షూట్‌లో శర్వానంద్, 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. 20 రోజులకు పైగా ఈ చిత్రీకరణ జరిగింది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ డిజైన్ చేశారు. ప్రోడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మన్నె రూపొందించిన భారీ సెట్‌లో చిత్రీకరించారు.
‘‘ఈ షెడ్యూల్ కోసం మూడు నెలలు ప్రీ- ప్రోడక్షన్ పనులు నిర్వహించాం. ఈ యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకుల ఒళ్లు జలదరించేలా చేస్తుంది. గంగ పాత్ర కోసం శర్వానంద్ ప్రతిరోజూ రెండున్నర గంటలకు పైగా మేకప్ వేసుకోవాల్సి వచ్చేది. మేకప్ తొలగించడానికి గంట పట్టేది. ఈ పాత్ర కోసం శర్వా ట్రాన్స్‌ఫార్మ్ అయిన విధానం, ఆయన నటన, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.
1960 నేపథ్యంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ ఫిక్షనల్ విలేజ్‌లో ఈ కథ సాగుతుంది. గ్రామీణ నేపథ్యం, బలమైన భావోద్వేగాలు, భారీ యాక్షన్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: కిషోర్ కుమార్ అరోకియా, సమర్పణ: లక్ష్మి రాధామోహన్.


