
తమిళనాడులో సినిమాలను, రాజకీయాలను వేరుచేసి చూడలేం. ఈ రెండింటి మధ్య అంత అవినాభావ సంబంధం ఉంది. ప్రఖ్యాత దివంగత రాజకీయ నాయకులు కామరాజర్, అన్నాదురై నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ వరకు సినిమాలతో చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్లే. ఇప్పుడు కూడా చాలా మంది నటీనటుల దృష్టి రాజకీయాలపైనే ఉందని చెప్పవచ్చు. తాజాగా విజయ్ రాజకీయ రంగప్రవేశం ప్రకంపనలు పుట్టిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన ప్రచారంలో జరిగిన దురదృష్టకర సంఘటన అనేక చర్చలకు దారి తీస్తోంది. సినీ రంగంలోనూ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పుట్టిస్తోంది.
ఉదాహరణకు సత్యరాజ్(Satyaraj ), విజయ్‌ను విమర్శించే విధంగా తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చేశారు. అందులో నటులను తలపై పెట్టుకొని ఊరేగకండి.., వాళ్లకు చాలా తెలుసని మీరు భావించకండి, నటించడం మాత్రమే తెలుసు. ఈ సమాజంలో జరుగుతున్న పెద్ద తప్పు నటులను ఐన్ స్టిన్ రేంజ్‌లో భావిస్తుండడమే. మమ్మల్ని నెత్తినెక్కించుకోకండి. మేము జస్ట్ పాటిస్తాం అంతే. మేము పెరియార్, అంబేడ్కర్ కాదని గుర్తుంచుకోవాలంటూ పేర్కొన్నారు.
ఈ కామెంట్‌పై దర్శకుడు పేరరసు తీవ్రంగా స్పందించారు. ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటులకు ఏమీ తెలియదు. ఒట్టి మట్టే అంటే ఎలా.. మీరూ నటుడే కదా.. మీరెందుకు సందేశం ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఎంజీఆర్ ఉన్నప్పుడు మీకు ఇలా అనే ధైర్యం ఉండేదా ? కమలహాసన్‌కు ఎంపీ పదవి ఇచ్చారని, మీరు డీఎంకేను అడగాల్సింది. పార్టీ కోసం శ్రమించిన వాళ్లు ఎందరో ఉండగా వారి కూతుళ్లకు పదవి ఇవ్వకుండా సత్యరాజ్ కూతురికి పదవి ఎందుకు ఇచ్చారని మీరు డీఎంకే పార్టీని అడగాలి. నటన అనేది ఒక వృత్తే. అందులోనూ ప్రపంచ జ్ఞానం కలవారు ఎందరో ఉన్నారు. వారిని అరకొర తెలిసిన వాళ్లు అని కించపరచరాదు అని దర్శకుడు పేరరసు సత్యరాజ్‌పై ఫైర్ అయ్యారు.