
తమిళనాడు కరూర్ ఘటనలో కుట్ర కోణం ఉందని సినీ నటుడు మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) పేర్కొన్నారు. సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరగడంతో 41 మంది మరణించగా 80 మందికిపైగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో విజయ్ తన క్రెడిబులిటీ కోల్పోయాడంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదానికి కారణం విజయ్ అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు అండగా మన్సూర్ అలీ ఖాన్ పలు వ్యాఖ్యలు చేశారు.
కరూర్ ఘటన ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిన భారీ కుట్ర అంటూ మన్సూర్ అలీఖాన్ అభిప్రాయపడ్డారు. రాబోవు ఆరు నెలల్లో ఈ ఘటనకు కారణమైన వారికి తప్పకుండా శిక్ష పడుతుందన్నారు. విజయ్‌ని అరెస్ట్ చేసినా సరే అతను బయపడడంటూ మన్సూర్ చెప్పుకొచ్చాడు. ఇదంతా ఆయన్ను రాజకీయంగా సమాధి చేసేందుకు వేసిన ప్లాన్ అని తన అభిప్రాయాన్ని చెప్పాడు.
'తమిళనాడులోని కరూర్ సంఘటన హృదయ విదారకం. నా స్వస్థలం కరూర్. ఈ ఘటన తర్వాత నాకు గత రెండురోజులుగా నిద్ర కూడా పట్టడం లేదు. నేను ఎలా నిద్రపోగలను..? ఆ తొక్కిసలాటలో మరణించిన వారందరూ ఎలాంటి బాధను అనుభవించారో తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. మన దేశంలో ఇలా జరగడం చాలా సిగ్గుచేటు. కరూర్ సంఘటనను తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆయుధంగా ఉపయోగించనున్నారు. మీకు విజయ్ ఎదుగుదల నచ్చకుంటే నేరుగా ఆయన్ను ఎదుర్కొండి. విజయ్ నినాదం తప్పు అయితే మీరు కూడా సమావేశాలు నిర్వహించి ఎండగట్టండి. అలా చేయడం చేతకాక ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటారా..? ఇది నీతిలేని రాజకీయమని అనిపించడం లేదా..?
మీ రాష్ట్ర ప్రజలనే ఇలా చంపుకుంటారా.. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత మీది కాదా.. తమిళనాడులో గెలుపు ఎవరిది అనేది రాబోయే ఆరు నెలల్లో ప్రజలు నిర్ణయిస్తారు. కొంతమంది తిమింగలంలా మింగేసేందుకు రెడీగా ఉన్నారు. విజయ్ ప్రమేయం లేకుండానే ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయంలో నేను విజయ్‌కు మద్దతు ఇస్తున్నాను. నా తమ్ముడు విజయ్‌ని నేనే పెంచాను. అరుణ జగతీశన్ నేతృత్వంలో జరిగే దర్యాప్తుతో ఏమీ ఒరిగేది లేదు. వారు సరైన పోలీసు రక్షణ కల్పించలేదు. ఏ పార్టీ అయినా ఇన్ని షరతులు విధించిందా..? అంత కఠినత ఉందా..? విజయ్‌ని ఇబ్బంది పెట్టే వారికి ఆరు నెలల్లో శిక్ష పడుతుంది.
41 మంది మరణానికి విజయ్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదని మీరు అంటున్నారు. కానీ, అతన్ని అక్కడే ఉండనివ్వకుండా పంపించేశారు. కనీసం మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర. విజయ్ గొప్ప వ్యక్తి. ఇలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాడు. తరువాత ఏమి చేయాలో అతనికి తెలుసు' అని నటుడు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు.