హిందీలో రీమేక్‌ కానున్న సౌత్‌ చిత్రాలు: హీరోలు ఎవరంటే?

Sakshi Special Story About Tollywood And Bollywood Remake Movies

దక్షిణానికి.. ఉత్తరానికి హద్దు చెరిగిపోయింది. సినిమా దగ్గర చేసేసింది. ఇక్కడ హిట్‌ అయిన సినిమా అక్కడ అక్కడ హిట్‌ అయిన సినిమా ఇక్కడ... ఇప్పుడు రీమేక్‌ జోరు పెరిగింది. సౌత్‌లో వచ్చిన పలు హిట్‌ చిత్రాలు హిందీలో రీమేక్‌ కానున్నాయి. మరి.. హిందీ రీమేక్‌లో నటించనున్న కథానాయకుడు కౌన్‌? ఆ విషయంలోనే బాలీవుడ్‌ నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. హీరో ఎవరు? అనేది తర్వాత తెలుస్తుంది. రీమేక్‌ కానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.

వెండితెరపై నవ్వులు కురిపించి బాక్సాఫీస్‌ను కాసులతో నింపిన తెలుగు హిట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్‌ 2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’. వెంకటేష్, వరుణ్‌  తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ రీమేక్‌కు ‘దిల్‌’ రాజు, బోనీకపూర్‌ నిర్మాతలు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనీజ్‌ బాజ్మీ తెరకెక్కిస్తారు. కానీ ఈ రీమేక్‌లో ఎవరు హీరోలుగా నటిస్తారు? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత రాలేదు. ఒక దశలో వెంకటేష్, అర్జున్‌ కపూర్‌ (నిర్మాత బోనీకపూర్‌ తనయుడు) పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు.

‘ట్యాక్సీవాలా’ వంటి హిట్‌ మూవీ తర్వాత విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో వచ్చిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా దక్షిణాది భాషల్లో విడుదల కాకముందే హిందీ రీమేక్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు బాలీవుడ్‌ బడా దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌. ఆ తర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’ హిందీ రీమేక్‌లో హీరో ఎవరు? అసలు సెట్స్‌పైకి వెళుతుందా? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత అయితే రాలేదు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో 2019లో విడుదలైన ‘మత్తువదలరా’ ఒకటి. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తనయుడు శ్రీ సింహా ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యారు. రితేష్‌ రాణా ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం హిందీ రీమేక్‌కి కూడా రితేషే దర్శకుడు. కానీ ఇందులో హీరో ఎవరు? అనే విషయంపై మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట.

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో 2019లో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్‌ హక్కులను దర్శక–నిర్మాత నటుడు అజయ్‌ దేవగన్‌ దక్కించుకున్నారు. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో అభయ్‌ డియోల్‌ మెయిన్‌ లీడ్‌ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ దర్శకుడు ఎవరు? సినిమాలోని మిగతా నటీనటుల గురించిన నెక్ట్స్‌ అప్‌డేట్‌ రాలేదు. అటు తమిళంలో మాధవన్, విజయ్‌ సేతుపతి హీరోలుగా పుష్కర్‌ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించిన ‘విక్రమ్‌ వేదా’ చిత్రం బంపర్‌ హిట్‌. ఈ సినిమా హిందీ రీమేక్‌ను పుష్కర్‌ గాయత్రి ద్వయమే డైరెక్ట్‌ చేయనున్నారు. అయితే ఇందులో హీరోలుగా ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఐదేళ్లుగా కొందరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇటీవల సైఫ్‌ అలీఖాన్, హృతిక్‌ రోషన్‌ పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్, హీరో విజయ్‌ కాంబినేషన్‌లో వచ్చిన తమిళ ‘కత్తి’ చిత్రం సూపర్‌ హిట్‌. ఈ సినిమా తెలుగు రీమేక్‌ ‘ఖైదీ నంబరు 150’లో చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళ ‘కత్తి’ హిందీ రీమేక్‌ హక్కులను దక్కించుకున్న దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ మాత్రం తమ సినిమాలో హీరో ఎవరో చెప్పలేదు. జగన్‌ శక్తి హిందీ రీమేక్‌ను డైరెక్ట్‌ చేస్తారని, ఇందులో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తారనే వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక కార్తీ కెరీర్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ హిట్స్‌ ‘ఖైదీ’ (2019) సినిమా హిందీ రీమేక్‌ రైట్స్‌ను అజయ్‌ దేవగన్‌ సొంతం చేసుకున్నారు. కానీ ఇందులో అజయే హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా చేస్తారా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

మరోవైపు మలయాళ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ది కూడా ఇదే పరిస్థితి. ఈ చిత్రం హిందీ రీమేక్‌ హక్కులను నటుడు, నిర్మాత జాన్‌ అబ్రహాం చేజిక్కించుకున్నారు. మరి.. హిందీ రీమేక్‌లో జాన్‌ నటిస్తారా? లేదా? అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇంకా మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ‘అంజామ్‌ పతిరా’, ‘దృశ్యం 2’, ‘ఫోరెన్సిక్‌’ చిత్రాలు హిందీలో రీమేక్‌ కానున్నాయి. కుంచకో బోబన్‌ నటించిన ‘అంజామ్‌ పతిరా’ రీమేక్‌ను రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్, ఆషిక్‌ ఉస్మాన్‌ ప్రొడక్షన్స్, ఏపీ ఇంటర్‌నేషనల్‌ సంస్థలు నిర్మిస్తాయి. దర్శకులు, నటీనటుల వివరాలు రావాల్సి ఉంది. ‘ఫోరెన్సిక్‌’ రీమేక్‌కు విశాల్‌ ఫరియా దర్శకుడు. ఇందులో విక్రాంత్‌ మెస్సీ హీరోగా నటిస్తారనే ప్రచారం సాగింది. మోహన్‌లాల్‌ ‘దృశ్యం 2’ హిందీ రైట్స్‌ను కుమార్‌ మంగత్‌ పాతక్‌ దక్కించుకున్నారు. హిందీ ‘దృశ్యం 1’లో నటించిన అజయ్‌ దేవగనే ‘దృశ్యం 2’లో కూడా నటిస్తారనే ప్రచారం సాగుతున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఈ సినిమాలే కాదు.. మరికొన్ని సౌత్‌ హిట్‌ సినిమాల రీమేక్‌ హక్కులను బాలీవుడ్‌ తారలు, దర్శక నిర్మాతలు దక్కించుకున్నారు. అయితే ‘కథానాయకుడు కౌన్‌’ అనేది మాత్రం నిర్ణయించలేదు. బహుశా కోవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత ఈ రీమేక్స్‌లో హీరోలుగా ఎవరు నటిస్తారు? అనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top