రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార ఛాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ రిలీజైన పది రోజుల్లోనే బిగ్ హిట్ సినిమాలను దాటేసింది. ప్రస్తుతం రూ.600 కోట్లకు చేరువలో ఉంది. ఇప్పటికే కూలీ, సైయారా, వార్-2 లాంటి సూపర్ హిట్స్‌ను సైతం దాటేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. కాంతార చాప్టర్-1 అక్టోబర్ 2న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
కాంతారకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా గురించి రిషబ్ శెట్టి ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ మూవీలోని క్లైమాక్స్ సీన్ కోసం తాను పడిన కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. క్లైమాక్స్ సీన్ షూటింగ్ సమయంలో తన కాలికి వాపు వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో చాలా అలసిపోయాయని రిషబ్ వెల్లడించారు . కానీ ఈ రోజు మా సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే క్లైమాక్స్ లక్షలాది మంది అభిమానం ముందు నా కష్టమంతా చిన్నబోయిందని తెలిపారు. ఇదంతా మేము విశ్వసించే దైవిక శక్తి ఆశీర్వాదం ద్వారా మాత్రమే సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్ సీక్వెన్స్ ఇప్పటివరకు అత్యంత పవర్‌ఫుల్ సన్నివేశాలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగాయ.. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌లో విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా..అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో కనిపించారు.


