
ప్రముఖ మలయాళ నటి రీమా కల్లింగల్ తాజాగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ మూవీలో పాత్రకు గానూ ఈ ఘనత దక్కించుకుంది. ఈ అవార్డ్ అందుకున్న రీమా సినీ ఇండస్ట్రీ, కెరీర్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను ఒక నటినేనని.. తన ప్రదర్శన గురించి మాట్లాడాల్సిన చోట అమ్మా గురించి ప్రస్తావించడం సరికాదని హితవు పలికింది.
ఈ అవార్డ్ ఈవెంట్లో రీమాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA)లో నాయకత్వ మార్పుపై మాట్లాడాలని ఆమెను అడిగారు. తన అవార్డ్ అందుకునే సమయంలో ఇలా అడగడం సరైంది కాదని రీమా అసంతృప్తి వ్యక్తం చేసింది. అమ్మాలో ఎక్కువగా మహిళల ప్రాతినిధ్యం కోసం తన మద్దతును ఉంటుందని తెలిపింది. కానీ ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రశంసను అందుకున్న సమయంలో అమ్మా రాజకీయాల గురించి అడగడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొంది.
రిమా కల్లింగల్ మాట్లాడుతూ..'నా సినిమాలో నటనకు నేను అవార్డు గెలుచుకున్నా. కానీ ఈ సినిమా గురించి ఎటువంటి ప్రశ్నలు మీరు అడగలేదు. నేను మొదట నటిని. అందరూ ఆ విషయం మర్చిపోయినట్లున్నారు' అని అన్నారు. కాగా.. సజిన్ బాబు దర్శకత్వం వహించిన థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ చిత్రం అక్టోబర్ 16న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. రీమా కల్లింగల్ ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (WCC) సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఈ కమిటీలో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పది మంది సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలో మంజు వారియర్, పార్వతి, రెమ్య నంబీసన్ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు.