
1990 దశకంలో తన అందంతో కుర్రకారును ఉర్రూతలూగించిన నటి రంభ. తెలుగు కుటుంబానికి చెందిన ఈమె తొలుత మలయాళంలో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తరువాత 1993లో ఉళవన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్‌లో 1994లో జగపతి బాబుతో అల్లరి ప్రేమికుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత వచ్చినా అల్లుడా మజకా సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. ఆ తరువాత రంభ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, విజయ్, కార్తీక్, అర్జున్ ఇలా ప్రముఖ కథానాయకులందరి సరసనా నటించి క్రేజీ కథానాయకిగా వెలుగొందారు.
15వ ఏటనే నటిగా రంగ ప్రవేశం చేసిన రంభ 20 ఏళ్ల పాటు తమిళం, తెలుగు మలయాళం, కన్నడం, హిందీ, బోజ్‌పురి తదితర భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. వివాహనం అనంతరం నటనకు దూరమయ్యారు. ఆమె సహ నటీమణులు సిమ్రాన్, జ్యోతిక వంటి వారు ఇప్పటికీ నటిస్తునే ఉన్నారు. కాగా రంభ మళ్లీ నటించడానికి రెడీ అయ్యారు. నటిగా 20 ఏళ్ల పాటు ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరించారన్నారు.
వివాహానంతరం సంసార జీవితం, పిల్లల సంరక్షణ కోసం నటనకు దూరంగా ఉండాలని భావించానన్నారు. తనకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారని, వారు ఇప్పుడు పెద్దవాళ్లు కావడంతో మళ్లీ నటించాలని కోరుకుంటున్నానని తెలిపారు. పలు అవకాశాలు వస్తున్నాయని, తన వయసుకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తానన్నారు. త్వరలో టాలీవుడ్,కోలీవుడ్ చిత్రాలతో వెండితెరపై రంభ కనిపించడం ఖాయమనే చెప్పవచ్చు.