మెగా ఫ్యామిలీలో మరోసారి ఆనందాలు వెల్లివిరాశాయి. హీరో రామ్‌చరణ్ (Ram Charan), ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపావళి పండగ సందర్భంగా చిరంజీవి ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగాయి. అప్పుడే ఉపాసనకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. రామ్‌చరణ్-ఉపాసన 2012 జూన్ 14న వివాహం చేసుకోగా 2023 జూన్‌లో తొలి సంతానంగా క్లీంకార పుట్టిన సంగతి తెలిసిందే!
కవలలు రాబోతున్నారు
మళ్లీ రెండేళ్ల తర్వాత మెగా కుటుంబంలో రెండింతల సంతోషం (కవలలు) రాబోతోంది. ఈ విషయాన్ని ఉపాసన తెలుపుతూ తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేసి.. ఈ దీపావళి డబుల్ సంతోషాన్ని తెచ్చింది. డబుల్ ప్రేమ, డబుల్ బ్లెస్సింగ్స్ అని పేర్కొన్నారు. ఇలా డబుల్ అని ఉపాసన పేర్కొనడం వెనక కారణం ఉంది. ఆమె కవలలకు జన్మనివ్వనున్నారు.
చిరంజీవి కుటుంబం
చిరంజీవి (Chiranjeevi Konidela)- సురేఖ దంపతులకు రామ్‌చరణ్, సుస్మిత, శ్రీజ.. అని ముగ్గురు సంతానం.. సుష్మితకు విష్ణుప్రసాద్‌తో పెళ్లవగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. శ్రీజకు శిరీష్ భరద్వాజ్‌తో పెళ్లవగా వీరికి నివృతి పాప పుట్టింది. తర్వాత వీళ్లు విడాకులు తీసుకున్నారు. అనంతరం కల్యాణ్ దేవ్‌ను పెళ్లాడగా.. ఈ జంటకు కూతురు నవిష్క జన్మించింది. కొంతకాలానికి శ్రీజ, కల్యాణ్ దేవ్ మధ్య అభిప్రాయపభేదాలు రావడంతో విడిపోయారు. రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు క్లీంకార పాప పుట్టింది. అలా మొత్తంగా చిరంజీవికి ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు.
చిరంజీవి కోరిక నెరవేరేనా?
దీంతో ఓ ఈవెంట్‌లో చిరు.. ఇంట్లో ఉంటే నాకు మనవరాళ్లతో ఉన్నట్లుగా లేదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉన్నట్లు అనిపిస్తోంది. చుట్టూ ఆడపిల్లే.. ఒక్క మగాడు కూడా లేడు. చరణ్.. ఈసారైనా ఒక అబ్బాయిని కనరా.. నా వారసత్వం ముందుకెళ్లాలని కోరిక.. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదాస్పదమయ్యాయి. అందరూ ఆడపిల్లలే ఉన్నారు, కాబట్టి ఓ మగపిల్లాడిని కోరుకోవడం తప్పు లేదని, కానీ ఆడపిల్ల పుడుతుందని భయపడటమే తప్పని పలువురూ అభిప్రాయపడ్డారు. మరి ఈసారి పుట్టే కవలల్లో ఒక్కరైనా మగపిల్లాడు ఉంటాడేమో చూడాలి!


