
తొలి సినిమా 'తిథి' (కన్నడ మూవీ)తోనే జాతీయ అవార్డు అందుకున్న రామ్ రెడ్డి మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ జుగ్నుమా (Jugnuma - The Fable film). ఈ మూవీ ద ఫేబుల్ పేరిట అంతర్జాతీయ స్థాయిలో విడుదలైంది. ఇప్పుడు దేశీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అలరించనుంది. జుగ్నుమా కథ ఇప్పటిది కాదు! తొమ్మిదేళ్ల క్రితం హిమాలయాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళాలకు తనవంతు సాయం చేశాడు రామ్ రెడ్డి.
ఆ సమయంలో ఈ కథ పురుడు పోసుకుంది. భారత్- నేపాల్ సరిహద్దులోని హిమాలయ ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ చేశారు. ఇందులో అడవిలో చెట్లను పరిరక్షించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియాంక బోస్ ప్రధాన పాత్రలు పోషించారు. బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలో జుగ్నుమా ప్రదర్శితమైంది. లీడ్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకుంది. సినిమా ప్రదర్శితమైన ప్రతి చోటా దర్శకుడి ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. దర్శకనటుడు అనురాగ్ కశ్యప్, నిర్మాత గునీత్ మోంగా సైతం సినిమా చూసి అభినందించారు.