టైటిల్: పురుషః
నటీనటులు:బత్తుల పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, వెన్నెల కిషోర్, రాయంచ కొక్కుర
నిర్మాత: బత్తుల కోటేశ్వర
దర్శకత్వం: వీరు వులవల
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
ఎడిటింగ్: కోటి
విడుదల తేది: మే 22,2026

కథేంటంటే..
గోవింద్ అలియాస్ బండ(పవన్ కల్యాణ్ బత్తుల),సత్తిబాబు అలియాస్ బొగ్గు(సప్తగిరి), శ్రీను అలియాస్ జంప్(కసిరెడ్డి రాజ్ కుమార్) ముగ్గురూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. పెళ్ళైన తర్వాత ఈ ముగ్గురికీ తమ తమ భార్యలతో రోజూ చిన్న చిన్న గొడవలు అతుతుంటాయి. భర్తలపై అనుమానం పెంచుకున్న ఈ ముగ్గురు భార్యలు..నిత్యం వారిని టార్చర్ చేస్తుంటారు. అదే సమయంలో చిన్నప్పటి స్నేహితుడు కిస్సు(వెన్నెల కిశోర్) పెళ్లి కుదురుతుంది. ఈ ముగ్గరు తమ భార్యలతో కలిసి ఆ పెళ్లికి వెళ్తారు. అక్కడ యవ్వనంలో గోవింద్, సత్తిబాబు, శ్రీనులు కలిసి చేసిన కొన్ని చిలిపి పనుల గురించి భార్యలకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రోజీ ఎవరు? గోవింద్ జీవితంలోకి ఆమె ఎలా వచ్చింది? కిస్సు రాసిన బుక్ ఈ ముగ్గురి కాపురాల్లో ఎలాంటి చిచ్చు పెట్టింది? విడాకుల కేసు ఏమైంది? చివరకు ఈ మూడు జంటలు మళ్లీ కలిశాయా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
భార్య బాధితుల కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘ఎఫ్ 2’ లాంటి సినిమాలు చాలా మంచి విజయం సాధించాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదు. చాలా కాలం తర్వాత భార్య బాధితుల నేపథ్యంలో వచ్చిన చిత్రం పురుషః. ఓ రకంగా ఇది పెళ్లైన మగాడి బయోపిక్ అని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య గొడవలతో మొదలైన ఈ కథ చివరకు ‘భార్యల్ని యుద్దంతో కాదు.. ప్రేమతో గెలవాలి’ అనే సందేశంతో ముగుస్తుంది.
సినిమా ప్రారంభంలోనే ముగ్గురు స్నేహితుల ఫ్యామిలో జరిగే గొడవలు.. కోర్టు కేసు సన్నివేశాలతో నవ్వులు పూయిస్తుంది. కోర్టులో విడాకుల కోసం వెళ్లిన ముగ్గురు స్నేహితలను అక్కడి న్యాయమూర్తి (వీటీవీ గణేష్) తన క్యాబిన్‌లోకి పిలుచుకొని వారి సమస్యలు ఏంటని అడగడంతో అసలు కథ మొదలవుతుంది. అయితే భర్తలు కష్టాలు.. భార్యలు చేసే టార్చర్ చూస్తున్నంతసేపు క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ఎఫ్ 2 లాంటి సినిమాలలోని కొన్ని సన్నివేశాలు మనకు గుర్తొస్తుంటాయి. ఫస్టాఫ్ అంతా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ చేసే కామెడీతో సాగిపోతుంది.వెన్నెల కిషోర్ ఎంట్రీ తర్వాత కామెడీ మరింత పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం ఎక్కువగా గోవింద్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. గోవింద్ ప్లాష్‌బ్యాక్, రోజీతో లవ్‌స్టోరీ కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఇక గొడవ అయిన ప్రతిసారి భర్తలు సూపర్ హీరోలుగా మారి వారితో యుద్ధం చేస్తున్నట్లుగా వచ్చే కామెడీ సీన్స్ కూడా అంతగా నవ్వించవు. చివర్లో ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని ప్రభావం కూడా అంతంత మాత్రమే.అయితే క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఊహించరు. కానీ, ఆ ట్వీస్ట్ రివీల్ అయిన తర్వాత గత సినిమాలు గుర్తుకు వస్తాయి. ముగింపు బాగుంటుంది.

ఎవరెలా చేశారంటే..
పవన్ కల్యాణ్ కి ఇదే తొలి సినిమా. అయినా కూడా చాలా బాగా నటించాడు. భార్య చేతిలో ఇబ్బంది పడే భర్తగా, ఫ్లాష్ బ్యాక్ లో నిజాయితీగా ప్రేమించే లవర్‌గా రెండు డిఫరెంట్ వేరియేషన్ చూపించి మెప్పించాడు. స ప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ ల కామెడీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. వెన్నెల కిశోర్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో నవ్వించాడు. భార్యలుగా నటించిన రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. రాజీవ్ కనకాల, టీవీ గణేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.
శ్రవణ్ భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ను కట్ చేసి ఉంటే సినిమా మరింత వేగంగా ఉండేది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.


