జనగణమన: మహేశ్‌ నుంచి పవన్‌కు!

Puri Jagannath Project Jana Gana Mana With Pawan Kalyan - Sakshi

మరోసారి తెరపైకి జనగణమన

పవన్‌తో చర్చలు జరుపుతున్న పూరీ జగన్నాథ్‌

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కలల ప్రాజెక్ట్‌ "జనగణమన". దీన్ని పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిస్తానని కొన్నేళ్ల క్రితం ప్రకటించాడాయన. కానీ ఎంత త్వరగా మొదలు పెట్టాలని అనుకున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్‌ ఆలస్యమవుతూనే వస్తోంది. మొదట్లో ఈ చిత్రాన్ని సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుతో తీస్తున్నట్లు వెల్లడించాడు పూరీ. కానీ అకస్మాత్తుగా ఈ ఇద్దరి మధ్య విభేదాలు తొంగి చూడటంతో అది అర్ధాంతరంగా ఆగిపోయింది. అంతేకాదు, భవిష్యత్తులోనూ మహేశ్‌తో సినిమాలు చేయనని పూరీ ప్రకటించడంతో పెద్ద వివాదమే చెలరేగింది. (చదవండి: పవన్‌ కల్యాణ్, రానా యాక్షన్‌)

ముచ్చటగా మూడోసారి చర్చలు
అయితే ఆ తర్వాతి కాలంలో మహేశ్‌ తన ఫేవరెట్‌ డైరెక్టర్‌ పూరీ అని చెప్పడమే కాక, ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో జనగణమన తిరిగి పట్టాలెక్కుతుందని అంతా భావించారు, కానీ అలా జరగలేదు. తాజాగా ఈ సినిమా కథను పవన్‌ కల్యాణ్‌కు వినిపించాడట పూరీ. ఇప్పటికే హైదరాబాద్‌లో వీళ్లిద్దరూ రెండు సార్లు సమావేశమై కథ గురించి చర్చించారట. కానీ పవన్‌ చేతిలో ఇప్పటికే బోలెడన్ని సినిమాలు ఉండటంతో ఆయన ఏమీ స్పందించడం లేదట. లేటైనా సరే కానీ పవన్‌తోనే చేసేందుకు పట్టుపడుతున్నాడట పూరీ. దీంతో మూడో దఫా చర్చలు జరుగుతున్నాయి.

ఎలక్షన్స్‌కు ముందు జనగణమన
ఇక ఈ సినిమాను రాబోయే సాధారణ ఎన్నికలకు ముందే రిలీజ్‌ చేయాలని భావిస్తున్నాడు పూరీ. దీంతో పొలిటికల్‌ పంచులతో సాగే ఈ సినిమా తనకేమైనా ప్లస్‌ అవుతుందేమోనని సినిమాలో నటించేందుకు పవన్‌ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నిజానికి 'కెమెరామన్‌ గంగ'తో రాంబాబు ఫ్లాఫ్‌ కావడంతో పవన్‌.. పూరీని పక్కన పెట్టేసినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ అదంతా గతం. ఇప్పుడు పవన్‌ మరోసారి అతడితో కలిసి ప్రయాణం మొదలు పెట్టేందుకు సుముఖత చూపుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ సినిమా మొదలు పెట్టాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఎందుకంటే పూరీ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్‌ దేవరకొండతో 'లైగర్‌' చేస్తున్నాడు. దీంతో పాటు బాలీవుడ్‌లో ఓ చిత్రానికి డైరెక్షన్‌ చేస్తున్నాడు. అటు పవన్‌ కూడా బోలెడన్ని సినిమాలతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: ప్రభాస్‌ ‘ఆదిపురుష్’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top