గతేడాది 'కల్కి'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్.. ఈ ఏడాది 'కన్నప్ప'లో అతిథి పాత్రలో మెరిశాడు. బాహుబలి రీ రిలీజ్ వల్ల మరోసారి థియేటర్లలోకి వచ్చాడు. కానీ స్ట్రెయిట్ మూవీ మాత్రం రాలేదు. లెక్క ప్రకారం డిసెంబరు 5న 'రాజాసాబ్' రావాల్సింది. కానీ సంక్రాంతికి వాయిదా వేశాడు. జనవరి 9న రిలీజ్ అని అధికారికంగానే ప్రకటించారు. గత రెండు మూడు రోజులుగా మళ్లీ వాయిదా అనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటిపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.
'రాజాసాబ్' సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజయ్యాయి. ఇవి చూసుంటే ఇందులో వీఎఫ్ఎక్స్ ఎక్కువగానే ఉండబోతుందని అర్థమవుతుంది. అందుకు తగ్గట్లే పని జరుగుతోంది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు ఈసారి కూడా ఆలస్యమయ్యేలా ఉన్నాయనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని ఖండించిన నిర్మాత.. చెప్పినట్లుగానే జనవరి 9న మూవీ రిలీజ్ అవుతుందని మరోసారి స్పష్టం చేశారు.
(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)
డిసెంబరు 25వ తేదీ కల్లా సినిమా తొలి కాపీ రెడీ అయిపోతుందని, అమెరికాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నామని.. పనిలోపనిగా నిర్మాత చెప్పుకొచ్చారు. ఈ మేరకు నోట్ రిలీజ్ చేశారు. దీంతో వాయిదా ఏం లేదులే అని ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హారర్ ఫాంటసీ కథతో తీశారు. భయపెట్టే అంశాలతో పాటు కమర్షియల్ సినిమాల్లో ఉండే పాటలు, ఫైట్స్, రొమాన్స్ లాంటివి కూడా ఉండబోతున్నాయి. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ అని ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రధారి. తమన్ సంగీతమందిస్తున్నాడు.
(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటికి అసభ్య వీడియోలు.. వ్యక్తి అరెస్ట్)
					
					
					
					
						
					          			
						
				
 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
