కొన్నాళ్ల క్రితం పలు వివాదాలకు కారణమైన తమిళ సినిమా 'బ్యాడ్ గర్ల్'. బ్రహ్మణులని కించపరిచే సీన్స్ ఉన్నాయని చెప్పి టీజర్ రిలీజ్ టైంలో చాలా హడావుడి చేశారు. సెన్సార్ దగ్గర కూడా పలు సమస్యలు ఎదుర్కొని ఎట్టకేలకు సెప్టెంబరు తొలివారంలో థియేటర్లలోకి వచ్చింది. రెండు నెలల తర్వాత ఇప్పుడు(నవంబరు 04 నుంచి) ఓటీటీలోకి వచ్చేసింది. హాట్‌స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
మధ్యతరగతి కుటుంబానికి చెందిన టీనేజ్ అమ్మాయి రమ్య (అంజలి శివరామన్). అందరు ఆడపిల్లల్లానే తనకు కూడా ఓ బాయ్ ఫ్రెండ్, సుఖంగా ఉండేందుకు చిన్న ఇల్లు ఉంటే చాలు అని కలలు కంటూ ఉంటుంది. స్కూల్ చదువుతున్నప్పుడు నలన్ (హ్రిదు హరూన్), కాలేజీలో అర్జున్ (శశాంక్), ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇర్ఫాన్ (టీజే అరుణాచలం)తో రిలేషన్‌లో ఉంటుంది. వీటిలో ఏ బంధం కూడా ఎక్కువరోజులు నిలబడదు. కంటికి రెప్పలా చూసుకునే తల్లి, అద్భుతమైన స్నేహితురాలు ఉన్నా సరే ఈమెని సమాజం 'బ్యాడ్ గర్ల్' అని ముద్ర వేస్తుంది. ఇలా కావడానికి కారణమేంటి? చివరకు రమ్య ఏం చేసింది? అనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఓ కుర్రాడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో  తిరిగితే సమాజం అతడిని ఏం అనదు. ఇదే పని ఓ అమ్మాయి చేస్తే తిరుగుబోతు అనే ముద్ర వేస్తుంది. ఆమె వైపు నుంచి తప్పుందా? అబ్బాయిల వైపు తప్పుందా? అనేది ఎవరు పట్టించుకోరు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని నిలబడిన ఓ అమ్మాయి కథే 'బ్యాడ్ గర్ల్'.
సాధారణంగా అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసే సినిమాల్లో మగాళ్లని కొన్నింట్లో వెధవల్లా, మరికొన్నింట్లో విలన్స్‌గా చూపిస్తుంటారు. 'బ్యాడ్ గర్ల్'లో అలాంటివేం ఉండవు. కేవలం ఓ అమ్మాయి మనసుని.. టీనేజీ నుంచి 30స్‌లోకి వచ్చేంతవరకు ఆవిష్కరించారు. ఏ మతం, ఏ కులంలో పుట్టినా సరే ఆడవాళ్లకూ మనసు ఉంటుంది. దానికి బోలెడన్ని కోరికలు ఉంటాయి. ఈ సినిమాలోనూ హీరోయిన్‌కి ప్రేమ, శృంగారం లాంటి ఆలోచనలు ఎక్కువగానే ఉంటాయి. ఎంతలా అంటే 9వ క్లాస్‌లో ఉన్నప్పుడే స్కూల్‌లోనే ఓ అబ్బాయికి ముద్దు పెడుతుంది. కాలేజీకి వెళ్లేసరికి శృంగారం, జాబ్ చేస్తున్నప్పుడు లివ్ ఇన్ రిలేషన్‌షిప్.. ఇలా ఉంటాయి.
ఓ అమ్మాయి తనకు నచ్చినట్లు బతికితే ఈ సమాజం, ఇందులోని వ్యక్తులు.. 'బ్యాడ్ గర్ల్'గా ఎలా ముద్రవేస్తారు అనేది చెప్పిచెప్పనట్లు ఈ సినిమాలో చూపించారు. క్లైమాక్స్‌లో ఆడపిల్లని పిల్లి పిల్లతో పోల్చి చూపించడం.. ఈ క్రమంలో రమ్య తల్లి చెప్పే డైలాగ్ భలే అనిపిస్తాయి. 'ఓ అబ్బాయి చేసిన గాయాన్ని మరో అబ్బాయి మానిపోయేలా చేయలేడు' లాంటి కొన్ని డైలాగ్స్ కూడా అవును నిజమే కదా అనిపించేలా చేస్తాయి. మూవీ విడుదలకు ముందు బ్రహ్మణులని టార్గెట్ చేసేలా సీన్స్ ఉన్నాయని అన్నారు గానీ చూస్తున్నప్పుడు అలా ఏం కనిపించలేదు.
ఎవరెలా చేశారు?
రమ్యగా అంజలి శివరామన్ అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసింది. టీనేజీ అమ్మాయిలా ఎంత బాగుందో.. స్వతంత్ర భావాలుండే మహిళగానూ చక్కగా ఇమిడిపోయింది. ఈమె పలికించిన చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ చాలా సహజంగా అనిపించాయి. ఈమె తల్లి పాత్ర చేసిన శాంతిప్రియ చాలా రియలస్టిక్ యాక్టింగ్ చేశారు. రమ్య స్నేహితురాలిగా చేసిన సెల్వి, బాయ్‌ఫ్రెండ్స్‌గా చేసిన హ్రిదు, శశాంక్, అరుణాచలం కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ విషయాలకొస్తే దర్శకురాలు వర్ష భరత్ గురించి చెప్పాలి. ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? వాళ్ల కోరికలు ఏంటి అనే విషయాల్ని ఫెర్ఫెక్ట్‌గా చూపించారు. ఈమెకు తోడు అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ సరిగ్గా సరిపోయాయి. ఈ తరహా సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు. చూసే వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని డైలాగ్స్ రియలస్టిక్‌గా ఉంటాయి కాబట్టి కుదినంతవరకు ఒంటరిగానే చూడండి.
- చందు డొంకాన

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
