
‘‘హోంబలే ఫిలింస్ సంస్థ విజయ్‌గారు ఫోన్ చేసి, ‘మహావతార్ నరసింహ’ సినిమాని తెలుగులో విడుదల చేయాలని కోరగా, వెంటనే ఓకే అన్నాను. విడుదలైన రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళుతున్నాం. ఈ సినిమాని విడుదల చేసేలా నరసింహ స్వామి అనుగ్రహించడం నా అదృష్టం’’ అని అల్లు అరవింద్ తెలిపారు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించిన చిత్రం ‘మహావతార్ నరసింహ’. ఈ సినిమా జూలై 25న విడుదలైంది.
తెలుగులో గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఎప్పుడూ థియేటర్స్‌కి రాని ప్రేక్షకులు ఈ సినిమాని వీక్షిస్తున్నారు’’ అన్నారు. ‘‘ప్రస్తుత సమాజానికి ఏం కావాలో అది ఈ చిత్రంలో ఉంది. కుటుంబంతో కలిసి వెళ్లి ఈ సినిమాని చూడండి’’ అని పేర్కొన్నారు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. ‘‘ఈ చిత్రాన్ని నా కుటుంబంతో కలిసి చూశాను.
సినిమా మొదలైన మూడో నిమిషం నుంచే మేము ఒక గుడిలో ఉన్నామనే భావన కలిగింది’’ అని తెలిపారు తనికెళ్ల భరణి. ‘‘మా సినిమాకు వచ్చిన ప్రతి ప్రశంస నరసింహ స్వామికే చెందుతుంది’’ అన్నారు అశ్విన్ కుమార్. ‘‘ఇది యావత్ భారత్ సినిమా. ఈ చిత్రం నిర్మించడం నరసింహ స్వామి కృపగా భావిస్తున్నాం’’ అని శిల్పా ధావన్ చెప్పారు.